Tuesday, September 9, 2014

నాస్తికుడు ౧

                                                      

నీలకం మహా దేవుడి దేవాలయము ముందు కొంత మంది గుంపులుగాయున్నారు. వారి చేతుల్లో కొన్ని నినాదాలతో కూడిన అట్టలున్నాయి. రామ తీర్థము లో ఆ రోజు మూఢ నమ్మకాలు పైన ఒక సమావేశము జరిగినది. అన్ని రకాల మూఢ నమ్మకాలను ఖండించాలని తీర్మానము చేయ చేయ బడినది. అందులో  భాగముగా గుడిలో జరిగే ఉపన్యాసముల పైన కూడా నిరసించాలనుకున్నారు. అందులో స్వామి శివానంద ఇస్తున్న ఉపన్యాసాలను ఖండించినారు.
          దేవాలయ కమిటీ వారు వారిని లోపలి రాకుండా అడ్డము పడినారు. వారి మధ్య వాగ్వాదములు కొంచెము తార స్థాయికి అందుకున్నాయి. ఇది తెలుసుకున్న స్వామిజి స్వయముగా బయటికి వచ్చినారు. వారిని సగౌరవము గా తన విశ్రాంతి గదిలోనికి ఆహ్వానించినారు. ఆయన ఏ విధమయిన అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించ లేదు. అందరినీ నవ్వుతూ లోపలి ఆహ్వానించినారు. అందరికీ త్రాగడానికి నీరు ఇప్పించినారు. అందరితో బాటు  తను కూడా నేల మీదనే కూర్చున్నారు. కొందరు పైన  కుర్చీపైన  కూర్చోమని చెబుతుంటే వారించినారు. ఆవేశము లోయున్న వారిని శాంత  పడుటకు కొంత సమయమును ఇచ్చినారు. తరువాత నెమ్మదిగా అడిగినారు.
“చెప్పండి, మీ సమస్య ఏమిటి?”
నలుగురు ఒక్క సారిగా మాట్లాడ బొయినారు. స్వామిజి  “అందరు మాట్లాడ వచ్చును. కానీ అందరూ ఒకే సారి అయితే ఎలా చెప్పండి. మీ సమస్య మీద అవగాహన యున్న వ్యక్తి ఎవరో అతడినే ముందు మాట్లాడ నిద్దాము. ఏమంటారు?”
ఒకరు చేయి ఎత్తినారు.
“మీ పేరేమిటి?”
“శేఖర్ “
“యితడు మాట్లాడుట మీకు ఇష్టమేనా?”
అందరూ తలలూపినారు.
“ఇంక చెప్పవయ్యా “
“మతము పేరుతొ , కులము పేరుతొ జనము ఉన్నాడో లేదో తెలియని దేవుడి కొరకు కొట్టుకొని చస్తున్నారు.ఈ  మూఢ నమ్మకాలకు వ్యతిరేకముగా మేము జనము లోనికి వెళుతున్నాము. అయితే మీరు చెప్పేవన్నీ మా ఆలోచనలకు వ్యతిరేకము గా ఉన్నాయి. అందుకే మీతో మాట్లాడుదామని వచ్చినాము.”
“ ఓస్, అంతేనా? ఆ పేరుతొ అన్నా మనము హాయిగా మాట్లాడు కోవచ్చును. చెప్పండి.”
“ఇంతకూ మీరున్నారని చెబుతున్న దేవుడు ఎక్కడున్నాడు?”
“మీలో, నాలో ,అందరిలో, అన్ని జీవ రాసులలో ఉండేది ఆయనే కదా.”
“అంటే, మీరు చెప్పేదేమిటి? మీ లెక్క ప్రకారము మేము కూడా దేవుళ్ళ మేనా?”
“ఔను ఖచ్చితముగా.”
“అంటే, మీలోను, మా లోను,ఒక్కడే దేవుడున్నారంటారా?”
“ఔను.”నవ్వుతూ స్వామిజి జవాబిచ్చినారు. అడుగుతున్న వాడికి పిచ్చి ఎక్కినట్లు అయినది.
“అయితే ,అందరిలో ఉండే ఈ దేవుడి కోసము గుళ్ళు, గోపురాలు  ఎందుకు చెప్పండి?”
స్వామిజి ఒక నిముషము ఆగినాడు. “ఇంతేనా ఇంకా ఏమయినా ప్రశ్నలున్నాయా?” అని అడిగినాడు.
“అందరిలో ఉండేది ఒకే దేవుడయితే ఇన్ని తెదాలేందుకు?” మరొకరు అడిగినారు.
“మంటకు, పొగ మధ్య నున్న నిప్పుకు తేడా తెలుసు కదా.”
“ఏమిటి?”
“ఏమీ లేదు మొదటిది నేరుగా మంటగా కనిపిస్తుంది. రెండవ దానిని దగ్గిరకు వెళ్లి పరిశీలిస్తే కాని మంట ఉనికి తెలియదు.”
ఎవరూ మాట్లాడ లేదు.
“మీలో ఆవేశము గా యున్న వారిలో మంట పైకి కనిపిస్తున్నాది. మిగిలిన  వారిలో అది అణిగియున్నది. ప్రశ్నలు వేసి వేధిస్తే తప్ప అది బయటకు రాదు. అంతేనా?”
“ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి?”
“ఒక చోట ఒక పెళ్లి లేదా, ఉత్సవము జరుగుతున్నది.అక్కడికి ఒకడు మండు టెండలో ఓ అయిదు మైళ్ళు నడచి వచ్చినాడు. బాగా అలసి పోయినాడు. ఆకలి వేస్తున్నది.ఎపుడెపుడు భోజనాలు పెడతారా అని చూస్తున్నాడు. మరొక వ్యక్తి,  ఆ వూళ్ళో వాడే అప్పుడే భోజనానికి వచ్చినాడు. ఇద్దరి ప్రవర్తనలో తేడా ఉంటుందా ఉండదా చెప్పండి.” నవ్వుతూ అడిగినాడు.
వచ్చిన వాళ్లకు తెలుసు, మొదటి వాడికి, అలసట, ఆకలి వలన ఆవేశము, కోపము వస్తుందని.రెండవ వాడికి అటువంటి సమస్య లేదు.
“అదే సంస్కారమున్న వాడయితే, అయిదు మైళ్ళ నుండి ఎండలో వచ్చి , అలసి పోయినా ఒకే ప్రశాంతత తో యుంటాడు. మామూలు వ్యక్తి అయితే అసహనాన్ని ప్రదర్శిస్తాడు.”
ఎవరూ మాట్లాడ లేదు.
“ఇది వారు ఎదిగిన వాతావరణము, వారికున్న అనుభవాలనుండి వస్తుంది. ఎక్కువ ప్రయాణము  చేసిన వాడికి ఎక్కువ అనుభవాలు ఉంటాయి, ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు. అందు వలన వారి ప్రవర్తన కూడా ఆ స్థాయి లోనే యుంటుంది. వారి ప్రతి సమస్యకు ఆవేశము బయట పడకుండా పరిష్కారానికి ప్రయత్నమూ చేస్తారు. “
“అంటే మేము ఎదుగుదల లేని వారమని మీ ఉద్దేశ్యమా?”,ఒకరు కోపముగా ప్రశ్నించినాడు.
“ప్రతి దానికి మీరే తీర్పు చెప్పుకోకూడదు. కానీ, ఏ విషయము నేర్చుకోవాలన్నా రెండు లక్షణాలు ఖచ్చితముగా యుండాలి. ఒకటి శ్రద్ధ. రెండవది ఓర్పు. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ముందుకు వెల్ల లేరు. మీకు రెండు కథలు చెబుతాను. వినే ఓపిక ఉందా?”
కథ అనేటప్పటికి అందరికి ఆసక్తి పెరిగింది. కానీ తాము అడిగిన ప్రశ్నకు జవాబు ఈయకుండా దాట వేస్తారేమోనన్న అనుమానము కూడా పెరిగినది.అయినా ఆయన చెప్పే విషయము వినడానికి సిద్ధ పడినారు.
“చెప్పండి”, అన్నారు అందరూ ఒక్క సారి.
“అయితే కొంత మందికి అనుమానాలున్నాయి. అనుమానాలతో అన్నీ పూర్తిగా అర్థము చేసుకోలేరు. సరే ముందు ఒక పని చేద్దాము. చిన్న ప్రయోగము. అందరూ కళ్ళు మూసుకోండి.”
అప్పటికే ఆయన మాటల ప్రభావములో నున్న వారు ఎందుకని అడుగ లేదు.
స్వామీజీ తిరిగి అన్నారు. “ఇందులో ఏ మాయా మర్మము లేదు. ఏ మెస్మరిజం లేదా హిప్నాటిజం లేవు. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఇక్కడ నేను ఏమి చెప్పినానో గుర్తు తెచ్చుకోండి. తరువాత నెమ్మదిగా ఇక్కడికి వచ్చే ముందు ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆ దృశ్యము మీ కాళ్ళ ముందు కనిపించాలి. తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము,  తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము,  తరువాత ఆ ముందు జరిగిన సంఘటన  ఆ దృశ్యము ...........ఇలా ఒక దాని వెంబడి ఒకటి మీ కళ్ళ ముంది జరిగిన పధ్ధతికి వ్యతిరేక మయిన దిశ లో మీ కళ్ళ ముందు కనిపించాలి. ఇలా మీరు నిద్ర లేచిన సమయము వరకు వెళ్ళండి.”
ఆయన చెప్పిన పద్ధతికి వాళ్లకు ఒక రకమయిన మత్తు వచ్చేసినది. ఒకరో ఇద్దరో తప్ప అందరూ ఆ ప్రభావములో యున్నారు. ఇలా ఒక పావు గంట గడిచింది.
“ఇంక అందరూ నెమ్మదిగా కళ్ళు తెరవండి”,అన్నారు.
ఒక్కొక్కరు నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నారు. కానీ కళ్ళు మూసుకొని పోతున్నాయి. ఒకరో ఇద్దరో తప్ప అందరికి మత్తుగా, అంతే గాక హాయిగా ఉన్నది అంత హాయి వారికి అసలు ఇంతకూ ముందు ఉన్నట్లు అనిపించా లేదు.
“మీరేమి చేసినారు?ఇంట మత్తుగా యున్నది?” ఇద్దరు అడిగినారు.
“నేనేమీ చేయ లేదు. చేసేదేదో మీరే చేసుకున్నారు. ఇంక కథ లోకి వెళ్దామా?”
“ఒక ఆశ్రమ విద్యాలయములో ఒకడు శ్రద్ధగా అన్నీ నేర్చుకున్నాడు. ఇంక తను నేర్చుకోవలసినది ఏమీ లేదనుకున్నాడు. అదే మాట తన గురువుతో చెప్పినాడు.
గురువు అన్నాడు,”నిజమే , నీవు అన్నీ నేర్చుకున్నావు. కానీ గుణ శర్మ నీ కంటే ఘటికుడు.”
“అతడికంటే నేను కూడా నేర్చుకున్నాను కదా. నిజానికి ఇంకా ఎక్కువే నేర్చుకున్నాను.”
“అయితే ఒక సారి తోట పల్లికి వెళ్లి, అక్కడ తోటలలో పనిచేస్తున్న వారికి చదవడము, వ్రాయడము నేర్పించి రా. తరువాత ఎవరు గొప్ప వారో చూద్దాము “, అన్నారు,గురువుగారు.
శిష్యుడు అలాగే వెళ్లి, మూడు నెలలు ఉండి, తిరిగి వచ్చినాడు.
“అక్కడ తోటల్లో పని చేసే వారు ఉత్త మూర్ఖులు.ఒక్కరిని కూడా కుదురుగా కూర్చో బెట్టి ఏమీ నేర్ప లేక పోయినాను.”, అని అన్నాడు.
తిరిగి,”గుణ శర్మ కూడా అక్కడికి వెళ్లి వాళ్లకు ఏమీ నేర్ప లేక పోయినాడుట కదా.”, అని అన్నాడు.
“ఔను.” ఆన్నారు గురువుగారు.
“అయితే గుణ శర్మ నా కంటే ఏ విధముగా గొప్ప వాడు?”,తిరిగి ప్రశ్నించినాడు.
“మరి నీవా సమయములో ఏమి చేసినావు?”
“చేయడానికి ఏముంది?వారి చుట్టూ తిరుగుతూ ప్రయత్నము చేస్తూనే యున్నాను. వారికి చదవడము, వ్రాయడము నేర్పించాలని.”
“మరి వాళ్ళు పగలంతా పనిలోనే యుంటారు కదా. అందుకని గుణ శర్మ సాయంత్రము, రాత్రి వారు పండుకొనే వరకు ఈ పనిలో యుండే వాడు. మిగిలిన సమయములో అక్కడ పంటలు వేసే పద్ధతులు, అవి పెరిగే పధ్ధతి శాస్త్రీయముగా గమనించి వ్యవసాయ పద్ధతులపై ఒక పుస్తకమే వ్రాసినాడు. ఆ పుస్తకము ఇప్పుడు పెద్ద వారి చేత బాగా మన్ననలను పొందింది తెలుసా? తను ఒకరికి నేర్పుటకు ప్రయత్నము చేయడమే కాదు. కాలాన్ని వృధా చేయకుండా తను కూడా నేర్చుకుంటూనే యున్నాడు. తను నేర్చుకున్న దాన్ని ముందు తరాలకు అండ చేయటానికి పుస్తక రూపములో తీసుకొని వస్తున్నాడు.” వెంటనే ఆ శిష్యుడికి తనలో లోపమేమిటో తెలియ వచ్చినది. గుణ శర్మ తన కంటే చాలా గొప్ప వాడని వెంటనే ఒప్పుకున్నాడు. ఈ కథ మీకు అర్థమయిందా?”స్వామిజి ప్రశ్నించినాడు. ఎవరినుండీ జవాబు రాలేదు.
ఇంక అసలు విషయానికి వస్తాను.చెరువు అడుగున ఎమున్నదీ తెలియాలంటే నీరు కలక తేరి యుండాలి. ఈ విషయము అర్థము కావాలంటే మనస్సు ప్రశాంతత తో యుండాలి.మిమ్ములను మీరు ఉదయము నుండి పరిశీలించుకొనుట వలన మీలో కొంత ప్రశాంతత ఏర్పడింది, కాస్త మత్తు కుడా కలిగింది. అందుకో తనను తానూ పరిశీలించుకొనుట అలవాటు చేసుకోవాలి.  ఈ పద్ధతిని బుద్ధుడు ఎక్కువగా వాడినాడు. తనను తాను పరిశీలించుకొని తను ఎవరో తెలుసు కోవాలని రమణ మహర్షి చెప్పినాడు. ఆ స్థితి వచ్చే వరకు తన వాదనే సరి అయినదని అనుకుంటాడు,ఎదుటి వారు చెప్పినది వినడము అర్థము కాదు. అందుకే మీ చేత ఈ ధ్యానము చేయించినాను. నీలో, నాలో యుండే దేవుడు ఒక్కడే అయినప్పుడు మరొక దేవుడి విగ్రహము పెట్టి పూజ చేయ వలసిన అవసరమేమిటి? ఇదే మీ ప్రశ్న. జీవితములో సంవత్సరాలు గడిచే కొద్దీ మనకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటిని కొంత మంది అసలు పట్టించుకోరు.కొంత మంది వాటి నుండి పాఠాలను నేర్చుకుంటారు. నేర్చుకున్న ప్రతి పాఠము వారి సంస్కారాన్ని పెంచ్తుంది.అంటే, వారు మిగిలిన వారి కంటే వేగముగా ముందుకు ప్రయాణము చేస్తారు. మిగిలిన వారు వెనుక పడతారు. ముందు వెళ్ళిన వారు తమ లక్ష్యము చేరుకొన్న తరువాత వెనుక బడిన వారిని నడిపించుటకు తిరిగి వస్తారు. ఇదంతా ఒక జన్మలో జరగదు.”
ఇంతలో, “మళ్ళీ జన్మలు ఉంటాయని అంటున్నారా?ఇది ఎలా నమ్మాలి? “ఒకరు అడిగినారు.
“ప్రస్తుతానికి నమ్మ వలసిన అవసరము లేదు. ఆ విషయము వివరముగా మరో సారి మాట్లాడుకుందాము. ఈ విధముగా మన కోసము వచ్చిన వారినే మహాత్ములు లేదా గురువులు అని అంటున్నాము. మరో విషయము. ఈ మొత్తము విశ్వాన్ని నడిపించే అద్భుతమయిన గుణాలలో ఒకటి ప్రేమ. మరొకటి కృతజ్ఞత. మొదటిది ఆ మహాత్ములు మనకు చూపించేది. రెండవది వారి యెడల మనకు ఉండ వలసినది.”
“మళ్ళీ మళ్ళీ వారిని గుర్తుకు తెచ్చుకుంటే వారు చెప్పిన విషయాలు మనకు గుర్తుంటాయి.అందుకే వారి రూపాలను మన ఎదురుగా ఉంచుకుంటే వారు చెప్పిన మంచి మనలో మెదులుతూ మనలను నడిపిస్తూ యుంటుంది. అంటే గాని, వారి పేరు చెప్పి ఇంకొకరితో యుద్ధాలు చేయాలని చెప్పిన వారు పరమ మూర్ఖులు.”
“కొన్ని ప్రత్యెక మయిన సందర్భాలలో జనము వారిని గుర్తు చేసుకోవడానికి కలిసినపుడు అది ఒక తిరునాళ్ళ అవుతుంది. అంతే కాదు ఆ సమయాల్లో ఎంతో మందికి జీవనోపాధి కూడా దొరుకుతుంది. మీ ప్రశ్నలకు కొద్ది  సమాధానాలు దొరికినాయనుకుంటాను. ఇంకా ఏమయినా ప్రస్నాలున్నయా?”
“ప్రశ్నలు చాలా ఉన్నాయి.  మేము మళ్ళీ వచ్చి మిమ్ములను అడుగ వచ్చునా?” వాళ్ళు అడిగినారు.
“మిగిలిన కార్యక్రమాలకు భంగము రాకుండా మీరు ఎప్పుడయినా రా వచ్చును. అంతే కాదు ఎటువంటి ప్రశ్నలయినా వేయ వచ్చును, విషయము తెలుసుకోవడానికి. మీరు అందరూ మా వాళ్ళే. సరేనా.”
“మరి, ఇంకో కథ చెబుతామన్నారు.”
‘కథల కేముంది? ఇంకో మారు చెప్పుకుందాము.”
“ఇంతకూ దేవుడి గూర్చి చెప్పా లేదు.”
“ఇప్పుడు నేను చెప్పినది ఆలోచించి, అప్పుడు మళ్ళీ ప్రశ్న వేయండి. అప్పుడు మళ్ళీ చెబుతాను.”
అందరూ ప్రశాంతముగా వెళ్లి పోయినారు.
“వీరికి చాలా చెప్పారండీ స్వామీజీ!” ఒక దేవాలయ కార్య కర్త అన్నారు.
“దారి తప్పిన వారికే ఎక్కువ చెప్పాలి, మిగిలిన వారికంటే”, అన్నారు స్వామిజి.



Sunday, May 25, 2014

ఆవు

                                                        

ఈ వ్యాసము ఆవు మీద వ్రాయాలని అనిపించినది. శ్రీ రామ శర్మ ఆచార్య భారతీయ సంస్కృతికి గంగ, గాయత్రి మరియు గోవు ప్రధానమయిన అంశాలని ఎన్నో సార్లు చెబుతారు. గంగను పరిశ్రమల వ్యర్థాలతో మురికి చేస్తున్నాము. గాయత్రి జపమే చేయటము లేదు. ఇక మన చేతులలో గోవు ఎంత దుర్భర మయిన జీవితాన్ని అనుభవిస్తున్నదో చెప్పనఖ్ఖర లేదు. ఆవులకు సంబంధించిన మూడు సంఘటనలను వ్రాస్తున్నాను.
మొదటిది ఏప్రిల్ నెల లైఫ్ పాజిటివ్ లో ప్రచురించబడినది. హైదరాబాద్ లో కొండ వీటి న్యూటన్ గారి ఆధ్వర్యములో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన ఒక వ్యక్తికీ చాలా కాలముగా ఆస్తమా వ్యాధి యున్నది. న్యూటన్ గారు ఆ వ్యక్తిని సమ్మోహన (హిప్నోసిస్) విద్య ద్వారా గత జన్మ లోనికి తీసుకొని వెళ్ళినారు. ఆయన యొక్క ఆస్తమా వ్యాధికి కారణమును తెలుసుకొనుటకు ప్రయత్నించినారు.అందులో ఆయన ఒకానొక గత జన్మ సంఘటన బయటకు వచ్చినది. ఆ జన్మ లో ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఒక ఎద్దు మీద సవారీ చేసే వాడు. ఎద్దు అలసి పోయిన తరువాత కూడా దానిని లాఠీ తో కొట్టి సవారీ చేసే వాడు. అది పడిన రొప్పు ఈయనకు ఈ జన్మలో ఆయాసము గా వచ్చినది అని తేలినది. మరి దీనికి విరుగుడు ఎలా? ఆ వ్యక్తీ మూడు నెలలు రోజూ క్రమము తప్పకుండా ఎదో ఒక ఆవు కళ్ళ లోకి చూస్తూ దానికి క్షమాపణ చెప్పుకోవాలని సూచనా వచ్చినది. మూడు నెలలు చేసిన తరువాత అతడికి ఆ వ్యాధి తగ్గి పోయినదట. ఇక మీ ఇష్టం, నమ్మండీ నమ్మక పొండి.
ఇక రెండవది. భారత దేశములో మొట్ట మొదటి సారి అత్యధికముగా హోమియోపతి పుస్తకాలను ప్రచురించేది జైన్ పబ్లిషర్స్ అని అందరికి తెలుసు. ఇందులో కూడా ఒక ఆవు పాత్ర యున్నది. ప్రచురణ కర్త కొన్ని హోమియో పుస్తకాలకు హక్కు సంపాదించుకొని ముందే ధిల్లీ దగ్గిర ఒక హోమియోపతి కాలేజ్ లో అమ్ముకొనుటకు ఆర్డర్ తెచ్చుకొన్నాడు. చాలా కష్ట పడి తక్కువ ప్రతులు తయారు చేసినాడు. ఏవో కారణాలు చెప్పి వాళ్ళు ఆ పుస్తకాలు తీసుకొనుటకు నిరాకరించినారు. ఎట్లో ఒప్పించి వాళ్ళకు ఆ పుస్తకాలను అమ్ముటకై ఆ కాలేజికి వెళ్లి కొడుకును బయట పుస్తకాల పార్సల్ కు  కాపలా ఉంచి లోపలకు వెళ్ళినాడు. ఈ లోపల ఒక ఆవు పరుగు తీస్తూ వచ్చి ఆ పార్సల్ ను కొమ్ములతో ఎత్తి పుస్తకాలను చెల్లా చెదురు చేసింది. ఆ దారిన పోతున్న హోమియోపతి విద్యార్థులు ఆ కుర్రాడికి సాయము చేయుటకు అక్కడికి ఆ పుస్తకాలను చూచి “ఇవి మాకు అమ్ముతావా?” అని అడిగినారు. పరిస్థితి తెలిసిన ఆ కుర్రాడు అందుకు సిద్ధ పడినాడు. వాళ్ల నాన్న అంగీకారము కుదరక నైరాశ్యముతో బయటకు వచ్చేటప్పటికి కొడుకు మొత్తము పుస్తకాలను అమ్మి వేసినాడు. ఈ విధముగా వాళ్లకు ఒక ఆవు మొదటి ప్రచురణ అమ్ముడవుటకై సహకరించినది.
ఇక మూడవ సంఘటన. నేను మా బంధువులని ఇద్దరినీ విజయవాడ బస్సు ఎక్కించాలని మా వీధిచివరలో నిలబడి యున్నాను. అక్కడ ఒక పుచ్చ కాయల కొట్టు ఒకటి యున్నది. పుచ్చ కాయల లోని మెత్తటి భాగాన్ని తిని మిగిలినది కింద పది వేస్తె ఒక ఆవు దూడ క్రింద వాటిని ఏరుకొని తింటున్నది. నా సరదా కోసము పది రూపాయలకు ముక్కలు కొని ఆ దూడ కు అందించినాను. అది వాటి గబా గబా తిని వేసి చాలా వేగముగా ఏటో వెళ్లి పోయినది నేను తిరిగి ఎదురు వైపున్న బస్ స్టాప్ కు చేరినాను. అయిదు నిముషాల తరువాత ఆ దూడ మరో మూడు దూడలను వెంట తీసుకొని నా దగ్గిరకు వచ్చినది. అవి ఎంత చెప్పినా వెనక్కు వెళ్ళవు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమయింది, వెళ్ళిన ఆవు దూడ నేను పుచ్చ కాయల ముక్కలను ఇస్తానని తన మరో మూడు సహచరులను పిల్చుకొని వచ్చినది. దానికి నా మనస్సులో ఇంకా లేవమ్మా అని అన్న ప్రతి సారీ దానికి అర్థమైనట్లు, అదేమీ కుదరదు మాకు కావలసినదే అన్నట్లు తల అడ్డముగా ఊపినది. అది ఆ ఒక దూడ మాత్రమె.ఇక నన్ను ఇవి వదలి పెట్టవని తెలుసుకొని అదే కొట్టు లోకి వెళ్లి మరో పది రూపాయలకు ముక్కలు తెచ్చి వాటికిచ్సిన తరువాత అవి నన్ను వదిలి పెట్టినవి.
ఇందులో నాకు కొన్ని విషయాలు తెలిసినవి. నేను మనసులో అనుకున్న మాట ఆ  దూడకు తెలుస్తున్నది. అంతే కాక అది తన స్నేహితులను తనతో బాటు తినాలని పిల్చుకొని వచ్చినది. ఇప్పటి మనుషులకిన్తటి ఇంగితమున్నదంటారా?

  

Saturday, April 26, 2014

శ్రీ భగవద్గిత 1

                                                      
                               భగవద్గీత మీద ఎన్నో పుస్తకాలు వచ్చినవి.
                           విరుస్తున్న పుష్పము మీద ఎన్నో కవిత్వాలు వచ్చినవి.
            కాని, తనలో కలిగే భావాలను వినే వాళ్ళు లేక పోయినా తన కోసము వ్రాసుకొనుట కూడా తృప్తిని ఇస్తుంది. మళ్ళీ ఎందుకు వ్రాయాలి? అంటే ఇంతకంటే జవాబు కష్టము.  ఉపనిషత్తుల సారము, తనను తాను తెలుసుకొనుటకు ఉపయోగ పడే బ్రహ్మ విద్య, అన్ని యోగ మార్గాలను తనలో ఇముడ్చుకున్న యోగ శాస్త్రము. ఇది భగవంతుడి వాక్కు కాక మరోకటవుతుందా?
          నడి సముద్రములో దిగిన తరువాత ముందుకు వెళ్ళాలా, వెనుకకు వెళ్ళాలా అని కొట్టుకుంటున్న నరుడు,
ప్రయాణమంటే ముందుకే ఉంటుంది, వెనుకకు కాదు, అంటూ పరిణామ దశ లోనికి దారి చూపిన నారాయణుడు, మరెన్నో పాత్రలు. ఇదే భగవద్గీత కు ఉపోద్ఘాతము.
          కాంతి మార్గములో  నడుస్తున్న పాండు రాజ కుమారులు, లుబ్దత్వముతో కళ్ళు మూసుకొని పోయిన గుడ్డి రాజు ధృత రాష్ట్రుడు, అహంకారముతో కళ్ళు మూసుకొని పోయిన ఆయన కుమారులు, ప్రధాన పాత్రలు.
           పెద్ద నాన్న మాట కోసము వారణాసిలో లక్క ఇల్లు మాయలో తగల బడి పోకుండా తప్పించుకొని, అడవులలో తిరిగి, తిరిగి, ద్రుపద రాజ పుత్రికతో వివాహముతో ఒక స్థితి ని అందుకున్నారు పాండవులు. ఋషుల, విజ్ఞుల యొక్క మాటలకు భయ పడి,  తొండలు తిరుగడానికి భయ పడే స్థలాన్ని రాజ్య భాగముగా పెద్ద తండ్రి ఇస్తే, అక్కడే యమునా నదీ తీరమునందు ఇంద్ర ప్రస్థము అనబడే అందమయిన నగరాన్ని నిర్మించుకున్నారు. రాజులందరిని జయించి, ప్రపంచాన్ని ఒకే ఛత్రము క్రిందికి తెస్తూ రాజ సూయ యాగము చేసినారు.
          ఈ యాగ వైభవానికి అసూయ పడిన ధృతరాష్ట్ర కుమారుడు పన్నిన కుట్రలో  భాగముగా మాయ జూదములో ఓడి పోయి, కుల స్త్రీ ని నిండు సభలో అవమానించిన నోరెత్త లేక పోయినారు. పదు నాలుగు సంవత్సరములు అరణ్య, అజ్ఞాత వాసము చేసి తిరిగి వచ్చిన తరువాత రాజ్యమును ఇచ్చటకు నిరాకరించిన ధృత రాష్ట్ర పుత్రులతో యుద్ధమునకు సిద్ధ పడి కురుక్షేత్రములో సైన్యాలతో నిలబడినారు.
         ఈ యుద్ధము కౌరవ పాండవుల మధ్య జరిగినదని చెబుతారు. నిజానికి పాండవులు కూడా కురు వంశీకులే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కావాలంటే,  ధార్తరాష్ట్రులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధమని చెప్పవచ్చును. ఎదుట యున్న భీష్మ ద్రోణాదులు  పాండవులకు ఆప్తులే. కానీ నిండు సభలో కుల స్త్రీ కి అవమానము జరిగినపుడు, నివారింప గలిగి కూడా మౌనముగా ఉంది పోయినారు. అందుకే వారి మరణము చాలా దారుణముగా జరిగినది. దుర్యోధనుడి తత్వము, పాంచాలీ స్వయం వరములో, ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణములో బాగుగా బయట పడినది.
          ధర్మ వ్యతిరేకముగావెళ్ళిన వారికి శిక్ష పాలకులు వేయక పోయినా ప్రకృతి వేస్తుంది. ఆ ప్రణాళికలో భాగమే మహా భారత యుద్ధము.  పదకొండు అక్షౌహిణిల దుర్యోధనుడి సైన్యము,  ఏడు అక్షౌహిణి ల పాండవ సైన్యము ఎదురుగా నిలది యున్నవి. వ్యాసుడి అనుగ్రహము వలన సంజయుడు దివ్య దృష్టిని పొంది, యుద్ధ రంగములో జరిగే సంఘటనలన్నీ ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.
ధృతరాష్ట్ర ఉవాచ:
ధృత రాష్ట్రుడు పలికినాడు.
ధర్మ క్షేత్రే కురు క్షేత్రే  సమ వేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవా కిమకుర్వతు సంజయ! ||

సంజయా! ధర్మ క్షేత్రము మరియు కురు క్షేత్రమునందు  యుద్ధము చేయు తలంపుతో  యున్న మా వాళ్ళు మరియు పాండవులు ఏమి చేసినారు?
యుయుత్సవ అంటే యుద్ధము చేసే ఆలోచనతో యున్న అని అర్థము. ఇది మా వాళ్లకు మాత్రమేనా? లేదా, పాండవులకు కూడా నా?
సంజయ అంటే సమ్యక్ సరి అయిన జయము కలిగిన వాడు.  
ఇక్కడ పాండవులను మా వాళ్ళ నుండి వేరు చేయుటలో ధృత రాష్ట్రుడిలో ఏర్పడిన భేద భావము తెలుస్తుంది.
ఈ శ్లోకములో మరొక విశేషమున్నది. ధార్మిక నిష్టురాలయిన ఇండోర్ మహా రాణి అహల్యా బాయి హోల్కార్, భగవద్గీత యొక్క ముఖ్య సందేశమును చెప్పమని పండితులను అడిగినదట. ఆ ప్రయత్నములో వారు ఈ మొదటి శ్లోకమును చదివినారుట. శ్లోకము పూర్తి కాగానే, సరిగానే చెప్పినారు, నాకు అర్థమయినది అన్నదట.  వారికేమీ అర్థము కాలేదు. ఏమి అర్థమయినది అని వారు అడిగినారు. వెంటనే ఆవిడ అన్నారుట, కనిపించ లేదా? క్షేత్రే క్షేత్రే  ధర్మం కురు. అని చెప్పినారుట. అంటే ప్రతి క్షేత్రములో లేదా ప్రతి చోటా ధర్మమునే ఆచరింపుము అని అర్థము.  విజ్ఞత యున్న ఆవిడ విదేశీ దాడులలో శిధిలమయిన ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించినది.


Sunday, March 23, 2014

విగ్రహారాధన


          విగ్రహారాధన అవసరాన్ని గురించి కొంత మంది వివరిస్తే, నిరాకారుడయిన పరమాత్మను ఆకారముతో ఏ విధముగా సూచిస్తాము?అని గట్టిగా వాదించే వాళ్ళున్నారు. ఈ విషయములో పెద్దలు చెప్పిన ఒక కథ యున్నది.
          ఒక కాకి రోజంతా తిరిగి, తిని, బాగా అలసిపోయినది. ఒక చెట్టు మీద కూర్చొని నిద్ర పోయినది. ఇంతలో ఒక వరద వచ్చినది.  ఆ వరదలో చెట్టు కొట్టుకొని పోయినది. కొమ్మలను గట్టిగా పట్టుకొని నిద్ర పోతున్న ఆ కాకికి ఏ మాత్రము మెలకువ రాలేదు. సుర్యోదయమయి, వెలుతురు వచ్చిన తరువాత కాకి కళ్ళు తెరిచినది.ఎటు చూచినా నీరు. కాకికి భయము వేసినది. తను చెట్టుమీద యున్న విషయము కూడా మరిచి పోయినది. తూర్పు వైపు చాలా దూరము ఎగిరినది.నేల కనిపించ లేదు.వెనుకకు తిరిగి వచ్చినది. దక్షిణము వైపుకు వెళ్ళినది. నేల కనిపించక తిరిగి మళ్ళీ నీళ్ళపై తేలి పోతున్న చెట్టు మీదికి చేరినది. అదే విధముగా పడమర మరియు ఉత్తరము వెళ్లి తిరిగి వచ్చినది. బాగా అలసి పోయినది. ఇంకా దిక్కు తోచక ఆ నీళ్ళలో కొట్టుక పోతున్న చెట్టు మీదేయుండి పోయినది. మధ్యాహ్నానికి, ఆ చెట్టు ఒక చోట గట్టును చేరినది. ఆ కాకి వెంటనే చెట్టును వదిలి వేసి ఎగిరి పోయినది.
          ఒక ధ్యానికి మొదట్లో ఆ కాకికి చెట్టు లాగానే ఒక ఆలంబన కావలసి యుంటుంది. దైవము మీద దృష్టి నిలబడిన తరువాత విగ్రహము యొక్క అవసరము యుండదు. కృష్ణుడే ఎదురుగా నిలబడి యుంటే కృష్ణుడి విగ్రహముతో అవసరము ఏముంటుంది? మీ అంతరంగ ప్రయాణానికి మొదట ఒక ఆలంబన కావలసి యుంటుంది. ఆ అలంబనే విగ్రహము లేదా గుర్తు.
          అగ్ని కీలల మెడ కూడా  ధ్యానము చేయ వచ్చును. మొదట మంటను చూచి, కనులు మూసుకొని, దానిని జాగ్రత్తగా గమనించాలి.

(ఇది స్వామి సత్యానంద సరస్వతి చెప్పినది)

Tuesday, February 18, 2014

అనుభూతి2

                                                    


         
ఇవంతా నిజమేనా? యని రాజీ అడిగింది. ఇన్ని విషయాలు మీరెప్పుడూ చెప్ప లేదు. అయినా,  ఎవరో ఎదో చెబుతారు, మనము తలాడించి వచ్చేస్తాము, ఆ తరువాత అంతా మరిచి పోతాము. అని యన్నాది.
అమ్మయ్యా! ఇన్నాళ్ళకు నీ నుండి ఒక ప్రశ్న వచ్చినది. నేను  ఎప్పుడు చెప్పాలనుకున్నా, నీవు అంత ఆసక్తి చూపించ లేదు, మొదట్లో నే వాటిని ఖండించే దానివి. అయినా నీ అనుమానాలన్నీ ఆయనే తీరుస్తాడు. రేపు మళ్ళీ వెళ్ళుతున్నాము  కదా!
ఎలా కుదురుతుంది? మనకు ఆయనతో మాట్లాడే అవకాశము ఉంటుందా?
ప్రయత్నము  చేద్దాము. కుదరక పొతే నీకు నేనే దిక్కు.



మర్నాడు మళ్ళీ వెళ్ళినపుడు గోపాలము నిర్వాహకులను కలవాలని వెళ్ళినాడు. స్వామీజీ ని వ్యక్తిగతముగా కలవాలని అక్కడికి వెళితే అక్కడ తన లాగే చాలా మంది యున్నారు. నిర్వాహకులు రాత్ర ౧౦ గంటల వరకు అందరికి అందు బాటు లో యుంటారని అప్పుడు కలియ వచ్చని చెప్పినారు.
ఇక్కడ రాజీ కి అన్నీ చాలా ఆశ్చర్యముగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నిజముగా యున్నాయా? ఇవి కన్పిస్తాయా? లేక పొతే ఇవి అన్నీ కూడా జానపద కథల లాంటివేనా?
ఈ విషయాలు తెల్సుకున్నందు వలన లాభమేమిటి? అందరూ మాట్లాడే మోక్షము వీటి వలన లభిస్తుందా?
ఎప్పుడూ తనకు చిరాకు కలుగుతుంది. దీనికి కూడా వైద్యము ఉందా?
ఈ లోపల ఉపన్యాసము మొదలయింది.
   ఈ దేహాన్ని భౌతిక దేహమన్నారు. దీనిని పై వాటికి అనుసంధానము చేయడానికి యుండే కంటికి కనిపించని దేహాన్ని సూక్ష్మ లేదా లింగ దేహము అని అన్నారు.
          ఈ దేహానికి భౌతిక మయిన అనుభవము కావాలి. సమయానికి తిండి కావాలి, కాస్త విశ్రాంతి కావాలి అవి నెరవేరిన తరువాత నిద్ర పోవాలనుకున్న దీనిని కామ దేహము కొన్ని అనుభవాలకొరకు ప్రేరే పిస్తుంది. అది కోరిక కావచ్చును, ఆవేశము కావచ్చును. ఈ విధముగా కామ దేహము దీనిని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కామ దేహాన్ని కేంద్రీకరిస్తే పనులవుతాయి, కానీ ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది.. తక్కువ స్థాయి తాంత్రికులు దీనినే ఉపయోగిస్తారు.
          దీనిని ప్రశాంత స్థితికి తీసుకొని వస్తే మనలో వివేకము మేలుకుంటుంది. మనో దేహము ముందుకు వస్తుంది. అందులో కూడా విపరీతముగా ఆలోచించి తల నొప్పి తెచ్చుకొన వచ్చును. అదుపులో యున్న మనస్సు మంచి స్నేహితుడు లాటిది.
          ఋషులు మనస్సును అగ్నితో పోల్చినారు. ఘర్షణ లేదా రాపిడి వలన వచ్చింది చాలా తక్కువ స్థాయి దయితే మనస్సు ఏడవ స్థాయికి (అంటే అన్నిటి కంటే పై స్థాయి ) చెందిన అగ్నిగా ఋషులు భావించినారు. అటువంటి మనస్సును మచ్చిక చేసుకుంటే అది మనకు ఎటువంటి పనులనయినాచేసి పెడుతుంది.
ఇంతలో ఒకరు ఒక చీటీ తెచ్చి ఆయన కిచ్చినారు. ఆయన మళ్ళీ కొన సాగించినారు.
ఇప్పుడే ఒక ప్రశ్న వచ్చినది. ఇవంతా నిజముగా యున్నాయా, లేదా ఇది కొంత మంది  సృష్టించిన ఒక కల్పనా? అని. మీరు ఎటువంటి మొహమాటము లేకుండా అడిగితేనే మేము చెప్పే వాటికి విలువ యుంటుంది. మీరు పరీక్షించి తెలుసుకొనే స్థితికి వచ్చి, మీరు ఋజువు చేయ గలిగితేనే మీకు ఇంకొకరికి చెప్పే హక్కు యుంటుంది. ఫలానా వారు ఇలా చెప్పినారు అని మీరు నమ్మ వచ్చును. కానీ మీరు ఇంకొకరికి చెప్పాలంటే ముందు మీకు మీరు పరీక్షించు కోవాలి.
ఈ విద్యలు భారత దేశపు ఋషులకు పూర్తిగా ఎరుకలో యున్నవే. కానీ ఆశ్రమాలకే పరిమితమయినాయి. ఈ ఆధునిక కాలములో ఫిలిప్పీన్ కు చెందిన మాస్టర్ చోవా కుక్ సూయి ద్వారా ఈ విద్య  ఒక ప్రణాళిక రూపములో నేర్ప బడుతున్నది. ఆ పద్ధతులతో మీరు ఏ విభిన్న దేహాలను మీ చేతులతో తాకి చూడ వచ్చును. మరొక శిక్షణ ద్వారా మీరు వీటిని మీ కళ్ళతో చూడ వచ్చును. వీటికి సంబంధించిన సాహిత్యము మీకు దివ్య జ్ఞాన సమాజములో విస్తారము గా దొరుకుతుంది. అయినా మీ ఆసక్తి ననుసరించి మీకు కొన్ని చిన్న పద్ధతులను సూచనా ప్రాయముగా ఒక రోజు నేర్పించ గలను.  ఇంకేమయినా ప్రశ్నలుంటే అడుగ వచ్చును.
          ఇప్పుడు అందరూ ధ్యానము, ధ్యానము అని అంటునారు. ధ్యానమంటే ఏమిటి? ఎలా చేయాలి? రాజీ లేచి అడిగింది.
          అందరూ ధ్యానము చేస్తున్నా మన్న వారే. కానీ ఈ ప్రశ్నను ఎవరూ అడగ లేదమ్మా! తనకు నచ్చిన వాటి మీదనే దృష్టి పెట్టి యుంచి ఆ దృష్టి మరల్చకుండా అది తన కు సిద్ధించే వరకు అలాగే యుండడము ధ్యానములో మొదటి మెట్టు. కానీ అది సరి అయిన పధ్ధతి కావచ్చును కాక పోవచ్చును.  దానికొరకు ఆవేశము గా ప్రయత్నము చేస్తే మనో దేహము పాత్ర కంటే కామ దేహము పాత్ర ఎక్కువ యుంటుంది . ఇది సరి అయిన పధ్ధతి కాదు.మన మనస్సులోకి ఇంకా లోతుగా వెళ్ళాలి. జీవితములో సంఘర్షణ ఎదురయినపుడు మనస్సు దానినే తలచుకొని క్రుంగి పొతున్నపుడు, ఆ మనస్సుకు శిక్షణ ఈయాలి. ఈ సమస్యలకు దారి చూపేది ధ్యానము. దేని పైనా దృష్టి పెట్ట వచ్చును. కానీ మనిషికి జీవిత పర్యంతము వచ్చే తోడూ శ్వాస మాత్రమే. అందుకే పతంజలి కానీ, విజ్ఞాన భైరవ తంత్రములో శివుడు కానీ శ్వాసను ఆలంబనగా తీసుకోవడాన్ని సుచిన్చినారు.
          సమస్యలతో కొట్టుకుంటున్న మనస్సు ఒక సారి ఈ ఆలంబనను పట్టుకోగానే నిశ్చలత్వము లోనికి వెళుతుంది. అందు వలన మనస్సు ఎటువంటి శక్తిని ఉపయోగించుకోలేదు.
          ఈ రకముగా ప్రశాంతత మొదటి ప్రయోజనముగా లభిస్తుంది. అందుకే గుండె పోటు ఉన్న వాళ్ళు ధ్యానము వైపుకు వస్తారు.
          భౌతిక దేహము తో ఎదుటి వాళ్ళను తిట్టి, కొట్టి  తనకు కావలసినవి సాధించు కొన వచ్చును. కామ దేహముతో ఆవేశము తో సాధించు కొన గలిగిన కోరికలను తీర్చు కొన వచ్చును. కానీ ప్రశాంతముగా మనస్సు నుప యోగించు కొనుట ఎవరికీ చేత కావటము లేదు.  మనస్సు ఆలోచన  లోనికి దింపి తిప్పి, తిప్పి, అలసట కలిగించి నిద్ర లోనికి దింపుతుంది.
          దానిని నియంత్రించుకుంటే ప్రశాంతత ఏర్పడుతుంది. దీని వలన ఇతర సూక్ష్మ దేహాలు కూడా శుద్ధి అవుతాయి. మనో నేత్రము తెరచుకొని మనము అనుకున్న స్థలాలను, దృశ్యాలను మన కామ దేహము ఎక్కడికి కదలకుండానే చూడ వచ్చును. మరికొంత ముందుకు వెళ్లి మానసిక సృజనాత్మకత లేదా క్రియేటివ్  విజువలైజేషన్ ద్వారామన ఉహాలను యథార్థము చెసుకొన వచ్చును. ఇప్పుడు దీనిని ఒక విద్య గా ప్రచారము చేస్తూ కొంత మంది లక్షలు ఆర్జిస్తున్నారు. అయినా మనో దేహమును వాడుకొనుట ఎవరికీ సాధ్యము కావటము లేదు. ఆయన ఆగినారు.
          ఇంకొకరు లేచి భౌతిక, కామ దేహములను ఉపయోగించు కొనుటగురించి చెప్పినారు. అలాగే  మనో దేహమును ఉపయోగించుకోనుట  గురించి మరి కాస్త వివరించండి.
          అదే చెప్పాలను కున్నాను. ఎదో యొక ధ్యాన పద్ధతిలో మనస్సును ప్రశాంతత కు తీసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు చాలా ఇష్టమయిన శబ్దాలు లేదా దృశ్యాలు మరేదయినా కావచ్చును, మీకు అనుభవము  లోనికి వస్తాయి. వాటిని మీరు పట్టించుకోకండి.  అప్పుడు మీకు ఏవి అవసరమో అవే కనిపిస్తాయి. ఇంతకు ముందు మీరు మీకు గుర్తు యున్నారు. ఇంకా మీరు ఎవరో మరిచి పోయే స్థాయిలో ఒక ఆనంద స్థితి వస్తుంది. ఇది ఒక అద్భుతమయిన అనుభూతి. అది దేహానికి సంబంధించ్నది కాదు. సుఖము కాదు.దానిని వర్ణించుటకు మాటలుండవు. దీనినే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని  వేద ఋషులు చెప్పినారు.. అంటే ఎక్కడయితే దేని నయితే నిర్వచించడానికి మాటలుండవో ఆ స్థితి.
          అంతే కాదు, అక్కడ అద్భుతమయిన వెలుతురు. అక్కడ సూర్యుడుండడు, చంద్రుడుండడు, మనము జీవించే లోకము కూడా అక్కడుండదు. అక్కడున్నదొక్కటే, ఆనందం, ఆనందం, ఆనందం. ఆ స్థితి లో మీరు ఒక ఋషి స్థాయిని అందుకుంటారు.
          అప్పుడు మీ మనో దేహము మిమ్ములను ఆడించదు. అది మీ చేతిలో బానిస గా పని చేస్తుంది. ఆ అనుభూతిని మీరందుకున్న తరువాత మీ మనస్సు మిమ్ములను అనుసరిస్తుంది. మీరనుకున్న వాటిని సృజిస్తుంది.    చాలా? స్వామీజీ ఒక తాదాత్మ్య స్థితి లోనికి వెళ్లి పోయినారు.
          అనుమానాలతో యున్న రాజీ కూడా తను కూడా ఒక తాదాత్మ్య స్థితిని చవి చూసింది.
                              


   -----------------------------------------------------
ఉపన్యాసము బాగుందా? ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా?

ఇంక అడిగేది, వినేది ఏమీ యుండవు. చేయడమే. రాజీ పైకి లేచినది.

Monday, February 10, 2014

అనుభూతి1

                                                       


గోపాలం చిన్నప్పటి నుండి ఒక విలక్షణమయిన వ్యక్తీ.  ఎప్పుడూ , ధ్యానము, యోగము,  సాధన  ఇటువంటి పదాలనే వాడే వాడు. అలాగని తన చదువులో ఎప్పుడూ వెనుక పడ లేదు. విద్యార్థిగా ఎప్పుడూ ముందు బల్ల మీదనే కూర్చునే వాడు. చదువులో కూడా అందరి కంటే ముందు ఉండే వాడు. అందుకే వెనుక ఎన్ని వ్యాఖ్యలు చేసినా అందరూ గోపాలం ముందు మాత్రము జాగ్రత్తగా మాట్లాడే వారు. అంతే కాదు, గోపాలం చాలా స్నేహ శీలి. పరీక్ష ముందు రోజు కూడా తన క్లాస్ వాళ్ళే కాదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా రాత్రంతా కూర్చొని అయినా వాళ్ళ అనుమానాలను తీర్చి పంపించే వాడు. అందుకే గోపాలం మీద నేరుగా కామెంట్ చేయడానికి ఎవరికీ ఇష్టముండేది కాదు.
           మాస్టర్  డిగ్రీ  చేసిన తరువాత ఒక కాలేజి లో లెక్చరర్ గా చేరినాడు. తల్లి దండ్రులు కూడా కొడుకు ఎక్కడ బైరాగులలో కలిసి పోతాడేమో అన్న భయముతో నచ్చ చెప్పి, లేక బెదిరించి పెళ్లి చేశాము అని, అనిపించినారు. భార్య పేరు రాజేశ్వరి. అందరూ రాజీ అని పిలిచే వారు. రాజీ అందరితో బాగా కలిసి పోయేది, చాలా కష్ట పడి ఇల్లును చాలా శుభ్రముగా యుంచేది. కానీ ఆమెకు ఒక విషయము అర్థమయేది కాదు. తన మొగుడు (ఇక్కడ భర్త అనే పదము వాడ తలచుకోలేదు ) ఉదయము సాయంత్రము క్రమముగ సంధ్యా వందనము చేసుకుంటున్నాడు, అన్ని విషయాలలో శ్రద్ధగా యుంటున్నాడు.  కానీ, అప్పుడప్పుడు, గంటల కొద్దీ కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, అదేమంటే ధ్యానమంటాడు. కాసేపు కబుర్లు చెబితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థము కావటము లేదు. ఇదంతా ఏమిటో తెలుసుకోవాలని అనిపించ లేదు, అందుకని వివరాలను అడుగ లేదు. కానీ తనకు చాలా చిరాకు వేసేది.  
          అద్దె ఇళ్ళలో యున్న గోపాలం ఒక చోటు చూచుకొని అక్కడే తన అనుస్థానాలను చేసుకొనే వాడు, వీలయినప్పుడల్లా ధ్యానము చేసుకొనే వాడు. చాలా సార్లు రాజీ చేత కూడా ధ్యానము చేయించాలని చూచినాడు. తను ఎటువంటి ఆసక్తి చూపించ లేదు. అంతే కాదు, తను ధ్యానము చేసే టప్పుడు బాగా ఆకలి వేస్తే, కేకలు వేసేది. అందు వలన ధ్యానము చేసేటప్పుడు, రాజీ కి ఆకలి వేసిందేమో లేదా వేస్తుందేమో అన్న భయము కూడా తనలో యుండేది. అందుకని, ఆ సమయములో ధ్యానము కుదిరేది కాదు.
          ఈ లోపల కుటుంబము కాస్త పెరగడము, పిల్లలు, వారి వ్యవహారాలూ, వీటితో గోపాలం తన వ్యాపకాలలోకాస్త వెనుక బడినాడు.. పిల్లలు ఎదిగి, దూరపు ఊళ్ళలో ఇంజనీరింగ్ చదువుల్లో చేరిన తరువాత, మళ్ళీ కాస్త వెసులు బాటు దొరికింది. పిల్లలు దూరమయిన తరువాత రాజీ కి కూడా  ఎదో కాస్త వెలితి కన బడ సాగినది.  అందుకని, ఇప్పుడు ధ్యానమంటే ఏమిటి? ఎలా చేయాలి? చేస్తే ఏమొస్తుంది? ఇటువంటి సిద్ధాంతపు ప్రశ్నలు వేసేది. అభ్యాసముకు మాత్రము బద్దకమే, ఇంట్లో పనులు చక్క బెట్టడానికి మాత్రము బద్ధకించేది కాదు.
          తనుండేది, అద్దె ఇండ్లలో. ఇల్లు మారిన ప్రతి సారీ, కొత్త వాతావరణము లో ధ్యానము కుదిరేది కాదు. ఆ సమయములో బాంకులు ఇల్లు కట్టుకోవడానికి అప్పులు ఈయడము మొదలు పెట్టినాయి.  ఒక స్థలము కొని బాంకు అప్పు తో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. అందులో ధ్యానము చేసుకోడానికి ఒక చిన్న గదిని తన ఆధీనములో ఉంచుకున్నాడు. అక్కడ మరే ఇతర పనీ చేయడానికి ఇష్ట పడే వాడు కాదు. అప్పుడప్పుడు తనకు బంధువులు ఎక్కువయినపుడు, తను మాత్రము ఆ గదిలో పండుకొనే వాడు. ఈ విషయములో రాజీ కి తనకు వాదనలు వచ్చేవి. చివరకు రాజీ పడి పోయే వారు.
          ఒక రోజు రాజీ ఏ బుద్ధి మీదుందో కానీ గోపాలాన్ని నిలేసింది.
ఇన్నాళ్ళూ ధ్యానము, ధ్యానము అంటూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు కదా!  ఏమయినా కనిపించినడా?        
  అంటే, కనిపించేదేమిటి?
మరి అలా కూర్చుంటే ఏమి వస్తుంది?
ఆ క్షణము కాస్త ఆనందముగా యుంటుంది.
నాతో వచ్చి, కూర్చోని, టి వి ప్రోగ్రాములు చూడండి.  ఆనందము రాదా ఏమిటి?
అలా కాదే, ధ్యానము చేస్తే మన ఆధ్యాత్మిక స్థితి  పెరుగుతుంది.
మరి, రొజూ సంధ్యా వందనము చేస్తున్నారు కదా!  దాని వలన ఆ స్థితి పెరగదా ఏమిటి?  ఇది కూడా ఎందుకు? గంటల కొద్దీ నిశ్శబ్దముగా అలా కూర్చుంది పొతే, ఇంట్లో ఎవరుండేది కూడా తెలియటము లేదు.
మూడవ కన్ను తెరుచుకుంటుందని, మంచి దర్శనాలు వస్తాయని చెప్పి  మెప్పించే శక్తి తనకు లేదు. అందుకే తను నిశ్శబ్దముగా యుండి పోయినాడు. తనే మళ్ళీ మొదలు పెట్టినది.
మీరు కళ్ళు మూసుకొని ఏమి చూస్తారు?
కళ్ళ ముందు ఏమి కనిపించినా గమనిస్తూ ఉంటాను.
ఇంతకూ ఏమి కనిపిస్తుంది? దాని వలన వచ్చే లాభ మేమిటి?
చీకటి వెలుతురు మధ్య ఏవేవో అర్థము కానివి కనిపిస్తాయి, అయినా వాటినే గమనిస్తూ యుంటాను.
దాని వలన వచ్చే లాభమేమిటి?
బయట ఏమి లభిస్తుందో తెలియక పోయినా, కనిపించిన వాటిని గమనించడమే సాధన.
ఏమో? ఏమి చేస్తునారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇంతకూ మీకు ఇలా చేయాలని చెప్పిన ప్రబుద్ధుడు ఎవడు?
ఆయనను గూర్చి అలా మాట్లాడ కూడదు.  అయన యొక మహా యోగి.
ఇంతలో పక్కింటావిడ ఎదో అవసరము కొద్దీ వచ్చింది.  రాజీ తో మాట్లాడుతూ,
ఈ రోజు శివాలయములో శివానంద స్వామి ఉపన్యాసముందట. వస్తారా?
వాళ్ళు  ఏమి చెబుతారో, ఏమో, నాకేమి అర్థమవుతున్దండీ?
ఏమో , ఆయన రాజ యోగము గూర్చి మాట్లాడుతాడుట. చాలా విషయాలు చెబుతారుట. చాలా మంది చెప్పినారు. మేము కూడా వెళుతున్నాము. ,  అంటూ వెళ్లి పోయింది.
రాజ యోగమనే మాట  గోపాలాన్ని పట్టేసింది.
రాజీ! నీవు కూడా  రావచ్చు కదే! నాకు వెళ్ళాలని యున్నది.
ఎందుకు? మీ చిన్నపుడెవరో కళ్ళు మూసుకొని కుర్చోమన్నారని, మీరు ఇప్పటి వరకు ఆ పనిని వదలి పెట్ట లేదు. అలా చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పటి వరకు మీ దగ్గిర నుండి జవాబు లేదు. ఇప్పుడిక్కడికి వెళ్లి వచ్చిన తరువాత, మీరా గదిలో, నేనీ గదిలో కళ్ళు మూసుకొని కూర్చుందాము, ఎవరు పిలిచినా పలుకకుండా గడియ వేడుకొని..
ఎందుకలా అనుకుంటావు? నీ ప్రశ్నకు ఈయన నుండి జవాబు వస్తుందేమో? 
ఇంతకూ ఈయన రాజ యోగము గూర్చి చెబుతారో, రాణీ యోగము గూర్చి చెబుతారో? సరే, మీరింతగా అడుగుతున్నారుగా! నేనూ సిద్ధమవుతాను. ఆ పేరుతొ నన్నా మీరొక రోజు మీ ధ్యానము మానేసి, శివాలయానికి వస్తారు కదా! అదే భాగ్యము.
 ------------------------------------------------------------------------------------------------------------------------
          దేవాలయ ప్రాంగణ మంతా క్రిక్కిరిసి యున్నాది. శివానంద స్వామి ఉపన్యాసము మొదలయింది.
  భగవంతుడు సర్వాత్మకుడు, అంటే అందరితో, లేదా అందరిలో ఉండే వాడు ఆయనే.
  సర్వ వ్యాపి, అంతటికి వ్యాపించేది ఆయనే.
సర్వ శక్తిమంతుడు. అందరిలో యుండేది ఆయన శక్తే.
అసలయిన మానవుడిని, అంటే మనలను కొంత సేపు ఆ పేరుతొ పిలువకుండా యాత్రీకుడిగా  భావిద్దాము.
తను ఎక్కడి నుండి వచ్సినాడో, ఏ మూలము నుండి వచ్సినాడో మఱచి పోయినాడు. ఆ మూలమును పట్టుకోవాలని సుదీర్ఘ యాత్ర మొదలు పెట్టినాడు. అందుకే ఈ పాంచ భౌతిక దేహము లోనికి తల్లి దండ్రుల సంకల్పము మరియు యోగము ద్వారా ప్రవేశించినాడు. ఆ విధముగా భౌతిక ప్రపంచానికి కట్టు వడి పోయినాడు.
ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు అర్థ రహితాలుగా విచిత్రాలుగా కనిపిస్తాయి. కాస్త ఓపిక తెచ్చుకొని వింటే అన్నీ అర్థమవుతాయి. అంతే కాదు ఇవన్నీ మన ప్రాచీన ఋషుల నిరంతర పరిశీలనలో తేలిన నిజాలు. వీటిని ఋజువు చేయ గలిగిన సాధనాలు ఇప్పుడు ఎన్నో వచ్చినాయి.
ఈ యాత్ర మొదలయింది.
ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మలు.                              
ఒక్క చోటు కాదు, ఎన్నో ప్రాంతాలు.
ఒక్క కష్టము కాదు, ఎన్నో సుదీర్ఘమయిన  క్లిష్ట మయిన అనుభవాలు.
వీటిని ఎదుర్కుంటేనే తను లక్ష్యాన్ని చేరుకుంటాడు.
ఈ విధముగా తను తన తండ్రి అయిన భగవంతుడి లాగా సర్వాత్మకుడు, సర్వ వ్యాపి, సర్వ శక్తిమంతుడు అని తెలుసుకుంటాడు. ఇన్ని అనుభవాల తరువాత తన తండ్రి ఎదిగిన తన బిడ్డను కౌగిలి లోనికి తీసుకుంటాడు. భక్తి మార్గములో దీనినే సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని అంటారు. ఇక్కడ నేను పూర్తి వివరణకు వెళ్ళుట లేదు.
మొదటి జన్మలలో జంతువులను వేటాడి, వాటి మాంసాన్ని ఆహారముగా స్వీకరించినాడు. తరువాత పక్షుల లాంటి వాటిని చూచి, ధాన్యపు గింజలను ఆహారములో కలుపుకున్నాడు.
సుఖాలను అనుభవించుటకు ఏర్పడిన బంధము పిల్లల మీద ప్రేమ గా మారుతుంది.
సమాజము పటిష్థముగా, శాంతివంతముగా ఉండాలంటే కొన్ని లక్షణాలు అందులో వ్యక్తులకు ఉండాలి.
మొదట వచ్చేది ఆశ. అంటే అది తనకు కావాలి. అది తనకు అందక పొతే ఆవేశము. ఎన్నో వైఫల్యాల తరువాత ఎందుకు ఇలా జరుగుతున్నాదని ఆలోచించడము మొదలుపెడతాడు. ఆలోచన మనస్సు యొక్క లక్షణము. అంత వరకు జంతువుల వలె ఆవేశముతో ఎగబడే యాత్రికుడు ఈ విధముగా మనస్సును ఏర్పరచుకొని మానవుడవుతాడు.  మానవుడు కూడా యాత్రికుడే అన్న విషయాన్ని మనము మరచి పోకూడదు.
ఇవన్నీ ఒక్క జన్మలో జరుగవు, కొన్ని జన్మల పర్యంతము జరుగుతుంది.
వెంటనే మరొక ప్రశ్న వస్తుంది. మనిషి చని పోయిన తరువాత అతడి దేహాన్నితగుల బెట్టి వేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తీ పుట్టిన తరువాత అన్నీ, మళ్ళీ అనుభవించ వలసిందేనా? ఒక జన్మకు మరొక జన్మకు సంబంధము ఎలా వుంటుంది?
తల్లి దండ్రులు ఇచ్చిన దేహాన్ని స్థూల లేదా పార్థివ దేహమని అంటారు. అంటూ తన దేహాన్ని చూపించినారు. పాదో అస్య విశ్వా భూతాని, త్రిపాద్ అస్య అమృతం దివి అని  పురుష సూక్తము చెపుతుంది. అంటే ఈ విశ్వములోఒక వంతు మాత్రమే మన కంటికి కన బడుతుంది ఉంటారు. మిగిలిన మూడు వంతులు దివిలోయుంటాయి, అంటే కళ్ళకు కనిపించవు. అందుకే నేను కళ్ళతో చూస్తే కానీ నమ్మనన్న వాడు నిజాన్ని ఎప్పుడూ చూడ లేడు.
కనిపించే ఈ వంటికి కనిపించని భాగాలు ఉన్నాయి. ఈ దేహాన్ని విశ్వానికి అనుసంధానము చేస్తూఒక దేహముంటుంది. దీనిని ఎథీరిక్ జంట అని పాశ్చాత్యులంటే సూక్ష్మ దేహమని వేద ఋషులు అన్నారు.
మనకు ఆవేశము కలిగినపుడు, అందుకనుగుణముగా స్పందించేమరొక దేహమున్నది. తీవ్రమయిన కోరికలకు ఆవేశాలకు అది తీవ్రముగా స్పందిస్తుంది.  ఇలాంటి స్పందన యున్నపుడు మనము వివేకాన్ని కోల్పోతాము.  ఈ దేహాన్ని ఆస్త్రల్ దేహమని పాశ్చాత్యులు, కామ దేహమని భారతీయ ఋషులు పిలిచినారు.
ఈ దేహము మనము నిద్ర పొతున్నపుడు  లోకమంతా తిరిగి సమాచారాన్ని సేకరిస్తుంది. దీనినే కామ దేహ గమనము లేదా యాస్త్రల్ ట్రావల్ అని అంటారు.దీనిని నియంత్రించి ఉపయోగించు కో గలిగితే  మనము ప్రపంచములో ఏ ప్రాంతములో ఎప్పుడు ఏమి జరుగుతుందో అతి తక్కువ కాలములో తెలుసుకొని రాగలము.
మనము ప్రశాంతతను తెచ్చుకోగలిగితే , మనలో వివేకము పెరిగే మనస్సు ముందుకు వస్తుంది. ఇది నియంత్రణ లేక పొతే భూతము లాగా మనలను చంపేస్తుంది. నియంత్రణ యుంటే స్వర్గాన్ని భూమికి దింపుతుంది.
          మన ప్రాచీన ఋషులు వీటిని త్రిపురాల నియన్నారు.ఇవి విచ్చల విడిగా యున్నపుడు వాటిని నియంత్రించడానికి మహా దేవుడే దిగి రావలసి వచ్చింది. అదే త్రిపురాసుర సంహారము. ప్రతి జన్మ చివర త్రిపురాసుర సంహారము జరుగుతూనే యుంటుంది.
          అయితే సూక్ష్మ దేహము తన యొక్క సమాచారాన్ని కామ దేహములోను, కామ దేహము తన యొక్క సమాచారాన్ని మనో దేహములోను, దాచి పెడుతాయి. ఈ అనుభవాలు కాస్త పేరుగా గానే వాటిని నిక్షిప్తము చేస్తూ కారణ దేహము లేదా ఆంగ్లములో కాజల్ బాడి ఏర్పడుతుంది. మనో దేహము తన అనుభావాలన్నిటిని కారణ దేహములో దాచి పెడుతుంది. మనిషి చని పోయిన తరువాత నాశనము కానిది కారణ దేహమొక్కటే. ఇదే గత జన్మలోని అనుభవాలను తరువాత జన్మకు చేరుస్తుంది. మనము మాట్లాడే కర్మ అంతా ఈ కారణ దేహము ద్వారానే అందించ బడుతుంది.
          మనిషికి మొదటి దశలో కామ్య సుఖాలు, తిండి, నిద్ర  ఎక్కువగా యుంటాయి. ఇవి మరీ ఎక్కువయితే నైరాశ్యముఏర్పడి ఇంకా ఏమున్నదని అన్వేషణ మొదలు పెడుతాడు. అక్షరాల సంపుటితో మంత్రం ఉచ్చారణ ద్వారా, కఠిన దీక్షల ద్వారా ఊగి పోయే కామ దేహము కొన్ని పనులను చేసి పడుతుంది. ఇక్కడ కొంత మంది మంత్రాలను ఇలా కూడా ఉపయోగిస్తారని చెపుతున్నాను. కాని వాటిని సాత్వికముగా వాడితే అద్భుతము అయిన ప్రయోజనాలు లభిస్తాయి.
          మళ్ళీ అసంతృప్తి కలిగి ఈ స్థితిని కూడా దాట వలె నని అనిపిస్తుంది. బురద నీటిలో ఏదీ కనిపించదు. కదలని స్వచ్చమయిన  నీటిలో అన్నీ కనిపిస్తాయి. అందుకని ఆవేశాన్ని నియంత్రించు కోవాలని అనుకున్నాడు. అప్పుడు మన దృష్టిని స్థిరముగా ఒక చోట యుంచాలి. అది మనతో నిరంతరాయముగా ఉండేదిగా ఉండాలి. అది శ్వాస కావచ్చును. అపుడు ఆవేశము తగ్గుతుంది. మనస్సు ఖాళీగా ఉండుటకు ఇష్ట పడదు. అది కల్లు/సారాయి తాగిన కోతి లాటిది. దానికి పని పెట్టాలి. ఇందు కోసమే విజ్ఞాన భైరవ తంత్ర లో పార్వతీ దేవికి శివ భగవానుడు ఉపదేశించిన మొదటి సాధన  శ్వాస మీద ధ్యాస.
          అప్పుడు మన మనస్సు అనే నీటి కొలనులో బురద క్రిందికి దిగుతుంది.  అడుగున యున్న రహస్యాలు సుస్పష్టముగా కన బడుతాయి.
          ఒక యజమానికి నలుగురు పిల్లలు ఉన్నారనుకుందాము. ప్రక్కింటి స్నేహితుడి కోరిక మీద వారికి సాయము చేయుటకు ఇంట్లో జిలేబి చేసినారు. నాలుగేండ్ల చిన్న కొడుకు బయట ఆటల నుండి పరుగుతో వస్తూ  ఎదురుగా జిలేబి చూచి అమ్మ వద్దని చెప్పే లోపల ఎవరితో చెప్పకుండా ఒకటి నోట్లో వేసుకొని, జిలేబి భలే యుందమ్మా!  అని చెప్పినాడు. ఇక అమ్మకు అవి మనకు కాదు అనే అవకాసము కూడా ఈయ లేదు.
          ఆరేండ్ల మూడవ కొడుకు నాకూ జిలేబి కావాలని గొడవ చేసి, మనకు  కాదంటే ఇల్లంతా పీకి పందిరి వేసే స్థితి లోకి తీసుకు వచ్చి, జిలేబి తీసుకొని తిన్నాడు.
          ఎనిమిదేండ్ల రెండవ కొడుకు అమ్మకు నాన్నకు తిన్నగా కబుర్లు చెప్పినాడు. దృష్టి మాత్రము జిలేబి మీదనే యుంది. అయినా ఆవేశ పడకుండా  ప్రక్కింటి వాళ్ళ కోసము చేసిన జిలేబి మనము తిన గూడదు అని తమ్ముళ్ళకు చెప్పి బుజ్జగించినాడు.. తల్లికి జాలి వేసి వాడికి కూడా ఒక జిలేబి ఇచ్చినది.
          పదేండ్ల మూడవ కొడుకు ఇవంతా తన దైనందిని (డైరి ) లో వ్రాసుకున్నాడు.
 ఇందులో పెద్ద వాడు కారణ శరీరాన్ని, రెండవ వాడు, మనో శరీరాన్ని, మూడవ వాడు కామ శరీరాన్ని, నాల్గవ వాడు భౌతిక శరీరాన్ని సూచిస్తారు. వారి వయస్సులు వారి పరిణామ స్థితిని సూచిస్తాయి.
ఈ సమయములో గుడిలో గంటలు మ్రోగినాయి. నైవేద్యానికి అన్నే సిద్ధమయినాయని ఉపన్యాసాన్ని ఆపి వేసినారు. మరునాడు అదే సమయానికి ఉపన్యాసము కొన సాగుతుందని ప్రకటించినారు