Saturday, April 26, 2014

శ్రీ భగవద్గిత 1

                                                      
                               భగవద్గీత మీద ఎన్నో పుస్తకాలు వచ్చినవి.
                           విరుస్తున్న పుష్పము మీద ఎన్నో కవిత్వాలు వచ్చినవి.
            కాని, తనలో కలిగే భావాలను వినే వాళ్ళు లేక పోయినా తన కోసము వ్రాసుకొనుట కూడా తృప్తిని ఇస్తుంది. మళ్ళీ ఎందుకు వ్రాయాలి? అంటే ఇంతకంటే జవాబు కష్టము.  ఉపనిషత్తుల సారము, తనను తాను తెలుసుకొనుటకు ఉపయోగ పడే బ్రహ్మ విద్య, అన్ని యోగ మార్గాలను తనలో ఇముడ్చుకున్న యోగ శాస్త్రము. ఇది భగవంతుడి వాక్కు కాక మరోకటవుతుందా?
          నడి సముద్రములో దిగిన తరువాత ముందుకు వెళ్ళాలా, వెనుకకు వెళ్ళాలా అని కొట్టుకుంటున్న నరుడు,
ప్రయాణమంటే ముందుకే ఉంటుంది, వెనుకకు కాదు, అంటూ పరిణామ దశ లోనికి దారి చూపిన నారాయణుడు, మరెన్నో పాత్రలు. ఇదే భగవద్గీత కు ఉపోద్ఘాతము.
          కాంతి మార్గములో  నడుస్తున్న పాండు రాజ కుమారులు, లుబ్దత్వముతో కళ్ళు మూసుకొని పోయిన గుడ్డి రాజు ధృత రాష్ట్రుడు, అహంకారముతో కళ్ళు మూసుకొని పోయిన ఆయన కుమారులు, ప్రధాన పాత్రలు.
           పెద్ద నాన్న మాట కోసము వారణాసిలో లక్క ఇల్లు మాయలో తగల బడి పోకుండా తప్పించుకొని, అడవులలో తిరిగి, తిరిగి, ద్రుపద రాజ పుత్రికతో వివాహముతో ఒక స్థితి ని అందుకున్నారు పాండవులు. ఋషుల, విజ్ఞుల యొక్క మాటలకు భయ పడి,  తొండలు తిరుగడానికి భయ పడే స్థలాన్ని రాజ్య భాగముగా పెద్ద తండ్రి ఇస్తే, అక్కడే యమునా నదీ తీరమునందు ఇంద్ర ప్రస్థము అనబడే అందమయిన నగరాన్ని నిర్మించుకున్నారు. రాజులందరిని జయించి, ప్రపంచాన్ని ఒకే ఛత్రము క్రిందికి తెస్తూ రాజ సూయ యాగము చేసినారు.
          ఈ యాగ వైభవానికి అసూయ పడిన ధృతరాష్ట్ర కుమారుడు పన్నిన కుట్రలో  భాగముగా మాయ జూదములో ఓడి పోయి, కుల స్త్రీ ని నిండు సభలో అవమానించిన నోరెత్త లేక పోయినారు. పదు నాలుగు సంవత్సరములు అరణ్య, అజ్ఞాత వాసము చేసి తిరిగి వచ్చిన తరువాత రాజ్యమును ఇచ్చటకు నిరాకరించిన ధృత రాష్ట్ర పుత్రులతో యుద్ధమునకు సిద్ధ పడి కురుక్షేత్రములో సైన్యాలతో నిలబడినారు.
         ఈ యుద్ధము కౌరవ పాండవుల మధ్య జరిగినదని చెబుతారు. నిజానికి పాండవులు కూడా కురు వంశీకులే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కావాలంటే,  ధార్తరాష్ట్రులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధమని చెప్పవచ్చును. ఎదుట యున్న భీష్మ ద్రోణాదులు  పాండవులకు ఆప్తులే. కానీ నిండు సభలో కుల స్త్రీ కి అవమానము జరిగినపుడు, నివారింప గలిగి కూడా మౌనముగా ఉంది పోయినారు. అందుకే వారి మరణము చాలా దారుణముగా జరిగినది. దుర్యోధనుడి తత్వము, పాంచాలీ స్వయం వరములో, ఘోష యాత్రలో, ఉత్తర గోగ్రహణములో బాగుగా బయట పడినది.
          ధర్మ వ్యతిరేకముగావెళ్ళిన వారికి శిక్ష పాలకులు వేయక పోయినా ప్రకృతి వేస్తుంది. ఆ ప్రణాళికలో భాగమే మహా భారత యుద్ధము.  పదకొండు అక్షౌహిణిల దుర్యోధనుడి సైన్యము,  ఏడు అక్షౌహిణి ల పాండవ సైన్యము ఎదురుగా నిలది యున్నవి. వ్యాసుడి అనుగ్రహము వలన సంజయుడు దివ్య దృష్టిని పొంది, యుద్ధ రంగములో జరిగే సంఘటనలన్నీ ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు.
ధృతరాష్ట్ర ఉవాచ:
ధృత రాష్ట్రుడు పలికినాడు.
ధర్మ క్షేత్రే కురు క్షేత్రే  సమ వేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవా కిమకుర్వతు సంజయ! ||

సంజయా! ధర్మ క్షేత్రము మరియు కురు క్షేత్రమునందు  యుద్ధము చేయు తలంపుతో  యున్న మా వాళ్ళు మరియు పాండవులు ఏమి చేసినారు?
యుయుత్సవ అంటే యుద్ధము చేసే ఆలోచనతో యున్న అని అర్థము. ఇది మా వాళ్లకు మాత్రమేనా? లేదా, పాండవులకు కూడా నా?
సంజయ అంటే సమ్యక్ సరి అయిన జయము కలిగిన వాడు.  
ఇక్కడ పాండవులను మా వాళ్ళ నుండి వేరు చేయుటలో ధృత రాష్ట్రుడిలో ఏర్పడిన భేద భావము తెలుస్తుంది.
ఈ శ్లోకములో మరొక విశేషమున్నది. ధార్మిక నిష్టురాలయిన ఇండోర్ మహా రాణి అహల్యా బాయి హోల్కార్, భగవద్గీత యొక్క ముఖ్య సందేశమును చెప్పమని పండితులను అడిగినదట. ఆ ప్రయత్నములో వారు ఈ మొదటి శ్లోకమును చదివినారుట. శ్లోకము పూర్తి కాగానే, సరిగానే చెప్పినారు, నాకు అర్థమయినది అన్నదట.  వారికేమీ అర్థము కాలేదు. ఏమి అర్థమయినది అని వారు అడిగినారు. వెంటనే ఆవిడ అన్నారుట, కనిపించ లేదా? క్షేత్రే క్షేత్రే  ధర్మం కురు. అని చెప్పినారుట. అంటే ప్రతి క్షేత్రములో లేదా ప్రతి చోటా ధర్మమునే ఆచరింపుము అని అర్థము.  విజ్ఞత యున్న ఆవిడ విదేశీ దాడులలో శిధిలమయిన ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించినది.


No comments:

Post a Comment