Tuesday, January 17, 2017

గ్రీకుల చరిత్ర లో ఒక ప్రశ్న-జవాబు




మన చరిత్రను వక్రించినారని మనము చెబితే ఎక్కువ మంది నమ్మరు. వక్రించిన వారి మాటలనే ఎక్కువ నమ్ముతారు. వారి ఇస్తున్న ఋజువులు తప్ప ఇతర రుజువులను నమ్మమని అంటారు. ప్రజల విశ్వాసమును, సాంస్కృతిక పరంపరను కూడా నమ్మము అని అంటారు. వీటి అన్నిటికి ఒకటే కారణము. తమ అహంకారము. ఇంత వరకు తాము నమ్మినవి, చెప్పినవి అబద్ధాలవుతాయని భయము. ఎక్కువ మంది కి ఇదే భయము. అందుకే కొందరు మహాత్ములంటారు,” నిజాన్ని ఒప్పుకొనుటకు చాలా ధైర్యము కావాలి” అని. ఒక్క సారి మళ్ళీ పరిశీలించుదాము అన్న ఆలోచనను బుర్రలోనికి రానీయరు. దీనినే బావ దాస్యమని అంటారు. ఇది కూడా ఒక విధమయిన పిరికి తనము.
విదేశీయులు ఆయా దేశపు చరిత్రలను గురించి పరిశోధనలను చేయునప్పుడు ఆ ప్రాంతపు భాషలను ఆకళింపు చేసుకొనే వారు. అక్కడ తర తరాలుగా ఉన్న నమ్మకాలను పరిగణన లోనికి తీసుకొనే వారు. అక్కడ జానపద గీతాలు కూడా చరిత్ర నిర్మాణానికి అవసరమే. Encyclopaedia Brittanica (బ్రిటిష్ విజ్ఞాన సర్వస్వము) లో కొన్ని దేశాలను గురించి ఇన్ని వివరాలు కనిపిస్తున్నవి. ఇంక పరిశోధన చేసే వారు అనువాదాల మీద కాకుండా ఆ ప్రాంతపు భాషలను, మరియు యూరప్ లోని మూల భాషలు అయిన లాటిన్ మరియు గ్రీకు భాషలలో అవగాహన క్షుణ్ణముగా కలిగి ఉండే వారు. అంతే గాని అనువాదాలమీద ఆధార పడే వారు కాదు.
కానీ మన దేశములోని ఎక్కువ మంది చరిత్రకారులు మన విశ్వాసాలను పట్టించుకోలేదు. నిజానికి ఆర్య ద్రావిడ సిద్ధాంతమును ప్రతిపాదించిన మాక్స్ ముల్లర్ మహాశయుడు ఈ దేశమునకు అసలు రాలేదని అంటారు. అదే పరంపర నేటి మన చరిత్ర కారులలో కోనసాగుతున్నది. విశ్వాసముల శాస్త్రీయతను పరిశీలించే అలవాటు లేదు. అవసరమయితే మూలాలను పరిశీలించుటకు అవసరమయిన సంస్కృత పరిజ్ఞానము లేదు చాలా మంది దృష్టిలో సంస్కృతము ఒక మూఢ మతానికి సంబంధించిన భాష. దానికి విలువే లేదు. ఈ విధమయిన అభిప్రాయాలతో వీరు తమ మూలాలకు దూరమయినారు. ఇప్పటికి సంస్కృతాన్ని పూర్తిగా బహిష్కరించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, వీరు ఆ సంస్కృతానికి ఆంగ్ల అనువాదాల మీద ఆధార పడుతారు.
నిజాన్ని ప్రతిపాదించాలన్నా లేదా నిరూపించాలన్నాఒక సమస్యను అన్ని కోణాలనుండి సమగ్రముగా పరిశీలించాలి. తమ పరిశోధనను ఒక దివ్య యజ్ఞముగా భావించి అందుకు అవసరమయిన ప్రతి భాషను, ఆలోచనలను, విశ్వాసాలను పరిశీలించాలి. అంటే గానీ శిథిల నగరాలను, నాణెములను, శిలా శాసనములను మాత్రమే నమ్ముతానంటే అసంబద్దముగా ఉంటుంది.
మన దేశములో మహా భారతము చరిత్రే కాదని అనే వారు ఉన్నారు. శ్రీ కృష్ణుడి పాత్ర వారి దృష్టి లో కవుల కల్పన. కృష్ణుడినే కాదన్న వారికి అంతకు ముందు జరిగిన రామాయణము మీద ఎటువంటి అభిప్రాయముంటుందో వివరించ వలసిన అవసరముండదు. ఇటీవల ఒక భారతీయ ప్రబుద్ధుడు ఒక అడవి మనిషి ఎలా శివుడిగా మారినాడో వివరిస్తూ మూడు పుస్తకాలు వ్రాస్తే దానికీ అంతర్జాతీయ బహుమతులు వచ్చినాయి. అదే వేరే ఒక మత గ్రంధములో పాత్ర మీద వ్రాస్తే ఇటువంటి బహుమతులు వచ్చేనా? ఇక “ఒక చారిత్రక పురుషుడి కథ గా గాక ,అత్యుదాత్తమయిన కథ గా అయినా రామాయణాన్ని అంగీకరిస్తారా?”అని ప్రశ్నిస్తే, వ్యతిరేకతే కనిపిస్తుంది. తాము ధరించిన రంగు కళ్ళద్దాల ద్వారా మాత్రమె చూస్తున్న వారికి ఏ ఇతర వ్యవస్థ లో అయినా లోపాలు కనిపిస్తాయి. అందుకు ప్రధాన కారణము జాతీయ భావానికి నైతికతకు ప్రాధాన్యత ఈయని మన విద్యా వ్యవస్థే. లేక పొతే దేశ ద్రోహకరమయిన వ్యాఖ్యలు చేయడానికి వ్యక్తీ స్వాతంత్ర్యము ఉన్నదని ఒక ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు పలికితే చర్య తీసుకోలేని వ్యవస్థ మనది.
రామాయణము జరిగినదని చెబితే నమ్మ లేని వారికి రామాయణ పాత్రలు కూడా అసహజముగా కనిపిస్తాయి. ఇక భారతము జరిగినదని చెప్పినా నమ్మ లేరు.
ఇక ప్రాచీన గ్రీకు చరిత్రకు ఏమి జరిగిందో పరిశీలించుదాము. హెన్రీ ష్లీమాన్ ఒక భావుకుడు. చిన్నప్పటినుండి తండ్రి ప్రభావముతో హోమర్ యొక్క దివ్య గాథలను వినే వాడు. తరువాత కాలములో తనే వాటిని మరల మరలా చదివే వాడు. ఆ నాటి ట్రాయి నగరపు సొగసులను మరల మరల మననము చేసుకొనే వాడు. ఎనిమిదన్నర అడుగుల వెడల్పు గల ట్రాయి నగర ప్రాకారాలు ఎంతో ఆశ్చర్యాన్ని కల్గించేవి. కానీ ఎవరితో చర్చించినా ,”ఇదేమిటి? ఎనిమిదన్నర అడుగుల ప్రాకారాలా? నమ్మాలంటారా?”అంటూ హేళన చేసే వారు. కానీ ష్లీమాన్ లో ఆలోచనలు అణగారి పోలేదు. హోమర్ రచనల పైన ఉన్న అపరిమితమయిన విశ్వాసము, తను చదివినవి నిజమేనన్న భావన అతడిని ఒక పురాతత్వ శాస్త్రజ్ఞుడిగా మార్చినది. హోమర్ యొక్క రచనలను క్షుణ్ణం గా పరిశీలించినాడు. అందులో దొరికిన సంకేతములను అనుసరించి ట్రాయి నగరమున్న స్థలమును టర్కీ దేశపు సముద్ర తీరములో గుర్తించినాడు. టర్కీ దేశాధినేతల సమ్మతిని పొందినాడు.
ఆ త్రవ్వకాలలో శ్లీమాన్ ఒక నగరము క్రింద మరో నగరము, దాని క్రింద మరో నగరము..ఈ విధముగా ఆరు నగరాలను గుర్తించినాడు. నేల మట్టమునకు పదిహేను అడుగుల క్రింద ఆరు అడుగుల మందము గల కోట గోడలు వెలుపలికి వచ్చినవి. ఇవి బహుశా ప్రయాం మహా రాజు యొక్క భవనపు గోడలు లేదా మినర్వా దేవాలయపు శిథిలాలు కావచ్చునన్న భావనతో శ్లీమాన్ యొక్క హృదయము ఉప్పొంగినది. జాగ్రత్తగా త్రవ్వినపుడు ఒకానొక గదిలో మూల ఆ నాటి అతి లోక సుందరి హెలెన్ ధరించినట్లు హోమర్ చేత చెప్ప బడిన ఆభరణాలు కళ్ళకు జిగేల్మంటూ కనిపించినవి. అంతు లేని సంపదలు లభించినాయని కాదు ఆనందము, హోమర్ రచనలతో తను పెంచుకున్న అనుబంధము , ఆ అద్భుత గాథలు నిజమని కనిపించే ఋజువు మనసును ఉఱ్ఱూతలు ఊగించినది. తను నిజాము కావాలనుకున్న ప్రాచీన గ్రీకు చరిత్ర కాళ్ళ ముందు ప్రత్యక్షము అయినపుడు మనస్సు అనిర్వచనీయమయిన ఆనందముతో నిండి పోయినది. హెలెన్ నగలతో తన భార్యను ఒక సారి అలంకరింప చేసినాడు. ఆ చాయా చిత్రమును Anne Terre White యొక్క Lost Worlds అనే పుస్తకములో చూడ వచ్చును.
దీనితో యూరప్ లో ఒక కొత్త సంచలనము ఏర్పడినది. అంత వరకు హోమర్ కథలను కట్టు కథలుగా భావించిన చరిత్ర కారులు ఒక్క సారి మేలుకున్నారు. టర్కీ లోని వేరు వేరు భాగాలలో త్రవ్వకాలు సాగించినారు. మైనీస్ ప్రాంతములో ఆగమేమ్నాన్ లాటి గ్రీకు వీరుల సమాధులను వెలికి తీసినారు. హోమర్ పాత్రలన్నీ చారిత్రక సత్యాలుగా ఋజువు అయినవి.
(ఇదే విధముగా Dr.SR Rao సౌరాష్ట్ర తీరములో ద్వారక శిథిలాలను వెలిక తీసినపుడు కోట్లాది భారతీయుల హృదయము ఆనందముతో ఉఱ్ఱూతలూగినది. ఆ శిథిలాలకు హరప్పా మేహెన్ జోడారో శిధిలాలకు పోలికలు కనిపించినపుడు ఆర్య ద్రావిడ సిద్ధాంతమునకు మొదటి గట్టి దెబ్బ తగిలినది.)

క్రీ పూ ౪౦౦౪ లో సృష్టి జరిగిందనుకున్న చరిత్ర కారులకు బ్రిటన్ లో ౫౦,౦౦౦ సంవత్సరాల నాగరికత అవశేషాలు కన్పించినపుడు మతులు పోయి ఉంటాయి.కానీ తమ చరిత్ర వక్రీకరణను వారు మాన లేదు.
visit: trilimga.blogspot.in