Monday, December 19, 2016

మన చరిత్ర3

                                                    
         
                                           కొత్త కథ  మొదలయింది
అలెక్జాండర్ మన  దేశము మీద దండెత్తి వచ్చినపుడు అటు తరువాత కొందరు గ్రీకు చరిత్ర కారులు మన దేశమును  సందర్శించినారు.  వారిలో మెగస్తనీస్, అర్రియన్  అను వారు ప్రముఖులు. అలెగ్జాండర్ మరణము తరువాత  సెల్యూకస్ యొక్క రాయబారిగా  మెగస్తనీస్ మన దేశములో చాలా కాలము ఉన్నాడు. వీరు వ్రాసిన అనుభవాల సంపుటములు చాలా వరకు శిథిలము అయినాయి.  శిథిలము కాని భాగాలను తిరిగి సంకలనము చేసి ప్రకటించినారు. ఈ సంకలములనే బ్రిటిష్ చరిత్ర కారులు ఉపయోగించుకున్నారు.
మెగస్తనీస్ వ్రాతలను అనుసరించి  ఆయన కాలములో భారత దేశ పరిపాలనలో  (అంటే  అప్పుడు మగధను పరిపాలించిన వారిలో) పరంపరగా ముగ్గురు వ్యక్తులను పేర్కొన్నారు. అది గ్రీకు వారికి అనువయిన ఉచ్చారణలో Xandrames, Sandrocottus, Sandrocyptus . అందులో మొదటి వ్యక్తిని నవ నందులలో ఒకరిగా , వారిని చంపి అధికారము చేపట్టిన మౌర్య చంద్ర గుప్తుని రెండవ వానిగా, ఆయన కొడుకు అయిన బింబి సారుడిని మూడవ వానిగా  జోన్స్ తిరుగు లేని నిర్ణయము తీసేసుకున్నాడు. ఈ విధముగా భారత దేశ చరిత్రను సుమారుగా ౧౨౦౦ సంవత్సరాలు ఆధునిక కాలము లోనికి లాగినాడు. ఇక పురాణాలలో ఉన్న పాత్రలను ఏమి చేయాలో వారి మధ్య కాలాన్ని ఎలా కుదించాలో ఆయనకే చేతనవుతుంది. చివరకు మన చరిత్రను వేరే వారు నిర్ణయించే దుస్థితి ఏర్పడింది.
భారతీయ మూల గ్రంథాలను చదివి వాటికి వ్యాఖ్యలను వ్రాసే భాద్యత మరో ప్రముఖ వ్యక్తికి ఈయ బడినది. భారత దేశానికి కీడు చేయాలని వచ్చినా భగవంతుడి ప్రణాళికను అనుసరించి ఆయన ద్వారా మేలే జరిగింది.  వేదాలను నిర్వీర్యము చేయాలనుకున్న ఆయన ప్రయత్నములో వేదములు అనే గ్రంథాలు ఉన్నాయని ప్రపంచమంతా తెలిసి,  వారు కూడా వేదాధ్యయనము చేయుట మొదలు పెట్టినారు. అయితే ఆయన తన భార్యకు వ్రాసుకున్నారు.” వేదముల అనువాదము భారత దేశపు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భారతీయుల అంతరాత్మను మేలుకొలుపుతుంది.  వేడాలంటే భారతీయుల ఆత్మలు. గత మూడు వేల సంవత్సరాలు ఏ వేదాలయితే భారతీయులను నడిపించిందో అవి (ఈ అనువాదాల వలన ) వారి హృదయ ఫలకాలనుంది చెరిపి వెయ బడుతాయి.” అది ఆయనకు కలగానే మిగిలి పోయింది. ఆ ప్రముఖ వ్యక్తీ పేరు  మాక్స్ ముల్లర్. ఆయన కూడా జోన్స్ పైన చేసిన ప్రతిపాదనను బల పరచడమే కాదు. అది భారత  చరిత్ర నిర్మాణమునకు  sheet-anchor  లేదా చుక్కాని లాంటిదని మెచ్చుకున్నాడు. ఈ నిర్ణయానికి అంగీకరించని విదేశీ చరిత్ర కారులను ఎవరూ పట్టించుకోలేదు.
ఈ విదేశీ చరిత్ర కారులలో  M.Troyer  ట్రాయర్ ప్రముఖుడు. ఆయన కాశ్మీర రాజ తరంగిణి మీద నిశితముగా పరిశోధన చేసినారు. ఏ విధముగా పరిశీలించిననూ  అలెగ్జాండర్ దండ యాత్ర కాలమున మగధ పాలకుడు మౌర్య చంద్ర గుప్తుడు కాజాలడని ఆయన ఎన్నో సార్లు మాక్స్ ముల్లెర్ కు వ్రాసినాడు. జవాబు రాలేదు. ఒకానొక సమావేశములో తటస్థపడినపుడు ట్రాయర్ తో  మాక్ష్ ముల్లర్ ఇలా అన్నాడు,”ఈ విషయము ఎప్పుడో నిర్ణయము చేయ బడినది. ఇంక తిరిగి చర్చించ వలసిన అవసరము లేదు.”
ఇంక విషయాన్ని మన కోణములో పరిశీలించ వలసి యున్నది.  మహా భారత యుద్ధమునకు పూర్వ కాలము నుండి, మగధకు గిరివ్రజము(నేటి  గిర్నార్) రాజధాని. అదే మౌర్య చంద్ర గుప్తుడి రాజధాని అయినది. కానీ గుప్త  రాజులు ఒక నాటి కుసుమ పురము అనే  మరో  పేరుతొ  ఉన్న  పాటలీ పుత్రమును రాజ దాని గా పాలించినారు. గుప్త వంశీకులు సూర్య వంశ క్షత్రియులు. అందుకని అయోధ్యలో పట్టాభిషేకము చేసుకున్నారు.  పాలింబోత్రా గా  మెగస్థనీస్ చెప్పిన రాజధాని పాటలీపుత్రము అవుతుంది కానీ ఎట్టి  పరిస్థితుల్లో మౌర్య చంద్ర గుప్తుడు యొక్క రాజ దాని అయిన గిర్నార్/గిరివ్రజము కాలేదు. మగధను పాలించిన ఆంధ్రుల ఆఖరి రాజు అయిన చంద్ర శ్రీ శాతకర్ణి పసి బాలుడు. ఈ పేరుకు మెగస్టనీస్ చేత చెప్ప బడిన  గ్జామ్ద్రేమ్స్ లేదా  Xandrames కు  శబ్దములో పోలిక ఉన్నది. చంద్ర శ్రీ ని వధించి అతడి సేనాని అయిన గుప్త చంద్ర గుప్తుడు పాటలీ పుత్రపు రాజు గా పట్టాభిషేకము  చేసుకున్నాడు. ఈయననే గ్రీకు రాయబారి సాంద్రోకొట్టాస్ (Sandrocottus) గా చెప్పినారు. ఇక  ఈయన కుమారుడు అయిన సముద్ర గుప్తుడు సాన్డ్రోసిప్టస్ (Sandrocyptus) అవుతాడు. ఇదే మౌర్య సామ్రాజ్య విషయముగా భావిస్తే నవ నందులలో ఎవరి పేరు Xandrames తో సరిపోతుందో తెలియదు. ఇంకా చంద్ర గుప్తుడిని మధ్య వాడిగా తీసుకున్నా అశోకుడి పేరు సాన్డ్రోసిప్తస్ తో  ఏవిధముగానూ సరిపోదు.
వారి సిద్ధాంతము ప్రకారము మౌర్య చంద్ర గుపుడు పాలకుడయితే ఆయన జీవితములో ప్రధాన పాత్ర వహించిన చాణక్యుడి పేరు ఎక్కడైనా ప్రస్తావన రావలసి యున్నది. కాని అది జరుగ లేదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయము. అంతే  గాక చాణక్యుడు అర్థ శాస్త్రములో వివరించిన నగర పరిపాలనా విదానముకు మెగస్తనీస్ వర్ణించిన నగర పరిపాలనా విదానముకు ఎక్కడా సంబంధము లేదు. ఆరు లక్షల సైన్యముతో దేశమంతనూ తన ఆధీనము లోనికి తెచ్చుకున్నాడన్న వ్యక్తీ ఏ మాత్రమూ మౌర్య చంద్ర గుప్తుడు కాదు. మౌర్య సామ్రాజ్యము దక్షిణాపథమునకు విస్తరించింది చంద్ర గుప్తుడి మనుమడు  అశోకుడు చేసిన కళింగ యుద్ధము తరువాతనే. కాని, సముద్ర గుప్తుడు దేశమంతా దిగ్విజయ యాత్ర చేసి, నావికా బలమును పెంచుకొని, విదేశీ వాణిజ్యము కూడా చేసినట్లు చెబుతారు. ఈ విజయ యాత్ర లో భాగముగానే వాయవ్య భాగములో నొక విదేశీ  రాకుమార్తె (సెల్యూకస్ కుమార్తె హెలీనా) ను వివాహ మాడినట్లు అలహాబాద్ శిలా శాసనములో ఉన్నది. కొద్ది మంది చేసిన వికృత కల్పనలు తప్ప మౌర్య చంద్ర గుప్తుడు ఏ విదేశీ రాకుమార్తె ను వివాహము ఆడినట్లు ఋజువులు లేవు.
మెగస్తనీస్ ఆ నాటి మగధ రాజులందరికి పేరు వెనుక వంశపు పేరు ఉండేదని, వారు సూర్య వంశ క్షత్రియులని వ్రాసినాడు. అందరి యొక్క పేరులో సూర్య వంశమును సూచిస్తూ ఆదిత్య పేరు ఉండేది. ఉదాహరణకు మొదటి చంద్ర గుప్తుడు, సముద్ర గుప్తుడు, రెండవ చంద్ర గుప్తుడుల యొక్క అధికారిక నామములు వరుసగా  విజయాదిత్య,  అశోకాదిత్య మరియు విక్రమాదిత్యులు. సూర్య వంశ క్షత్రియులకు ఆదిత్య శబ్దము ఎటువంటి అసంబద్ధతను సూచించదు. కానీ మౌర్య వంశీయులకు ఇటువంటి సాంప్రదాయము లేదు.
అర్థము కాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర నిర్మాణము ఎలా జరిగిందని ప్రశ్నిస్తే వారినుండి సరి అయిన జవాబు ఉండదు. బైబిల్ లీ ఇండీ లో లూయీస్  జకోలియట్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుందాము. “రెవరెండ్ ఫాదిరీలు, జెసూట్లు, ఫ్రాన్సిస్కన్లు మరియు ఇతర సంస్థలు ఒకే లక్ష్యముతో పుస్తకముల దహన కాండను చేసినారు. చదువుకున్న వారే గాక ప్రాచ్య పరిశోధకులు కూడా ఈ విషయాన్ని ఖండించుట ఎంతో అవశ్యము. ప్రతి యొక్క వ్రాత ప్రతి, ప్రతి సంస్కృత గ్రంధము వారి చేతులలో పడుటే తరువాయి,  నాశనము చేయ బడి, దగ్ధము  చేయ బడినది. ప్రాచీన  గ్రంధమయితే సరి, దేనిలో విషయాలు  వేరొకరి చేత ప్రశ్నింప బడుటకు వీలు లేకుండా ఉంటాయో అట్టి గ్రంధములు ప్రముఖముగా తగుల పెట్ట బడినవి.”

ఈ విషయము పై జస్టిస్ తిలాంగ్ వాక్యములు ఇలాగున్నవి.” ముందు నిర్ణయించుకొని చేసిన ఇటువంటి ప్రకటనలు భారత దేశపు ప్రాచీనతకు ఏంతో హాని చేస్తున్నవి. చిల్లింగ్వర్త్ పరిభాషలో “వారాశించే దానిని గూర్చి  కలలు గంటారు.ఆ కలలే నిజమని నమ్ముతారు.””
Also visit  trilimga.blogspot.in
give your comments.

Monday, November 14, 2016

మన చరిత్ర2

                                                    

                           భారత దేశ చరిత్ర- ఒక పరిశీలన

బ్రిటీషు వారు రాక ముందు భారత దేశమునకు చరిత్ర లేదు.
మొట్ట మొదటి సారి భారత దేశ చరిత్ర వ్రాసినది ఆంగ్లేయులు
భారత దేశము మొట్ట మొదట సారి ఒక జాతిగా ఏర్పడినది ఆంగ్లేయుల కాలములోనే.
మన దేశములో ప్రముఖులుగా చెప్ప బడుతున్న కొందరు ఈ మాటలనే మాట్లాడుతారు. చరిత్ర పుస్తకాల నిర్మాణముపై వారి ప్రభావము చాలా ఉన్నది. ఈ నాటి చరిత్ర విద్యార్థులు వారి మాటలనే నమ్ముతున్నారు. ఈ విధముగా వారు తమ గతాన్ని మరచి పోయి తమ సాంస్కృతిక సంపదకు దూరమవుతున్నారు. ఇటువంటి స్థితి ఎందుకు వచ్చినది?
విదేశీ దాడులకు ముందు ఈ దేశము సాంస్కృతికము గా ఒకే మార్గములో నడుస్తూ ఉండేది. ఎంత మంది పాలించినా , ఎన్ని చిన్న చిన్న రాజ్యాలున్నా ఎన్ని ఆరాధనా పద్ధతులు ఉన్నా దేశము అంతటా ఒకే సాంప్రదాయములో ఉండేది.  మొత్తము భూమిని పాలించిన చక్రవర్తులను గురించిన పూర్తి విషయాలు ఉన్నాయి. అతి ప్రాచీన కాలాన్ని వదిలి వేస్తే, అయిదు వేల సంవత్సరాల క్రిందట ధర్మ రాజు దేశమును ఒకటిగా చేసి  పాలించినాడు. తిరిగి ముక్కలయిన దేశాన్ని విక్రమార్కుడు కలి యుగాబ్ది ౩౦౪౫  లేదా క్రీస్తు శకము ౫౭ లో ఒకటి చేసి పాలించి యుగ పురుషుడు అయినాడు. తిరిగి ముక్కలయిన దేశాన్ని ౧౩౫ సంవత్సరాల తరువాత ఆయన ముని మనుమడు అయిన శాలి వాహనుడు ఒకటి చేసి మళ్ళీ శక పురుషుడుగా పేరును పొందినాడు.  మయుడు, ఆర్యభట్టు, వరాహ మిహిరుడు, భట్టోత్పలుడు, బ్రహ్మ గుప్తుడు, భాస్కరుడు లాంటి శాస్త్రజ్ఞులు ఏంటో మంది ప్రశస్తిని పొందినారు.
మన దేశము మీద దాడి చేసిన అత్యంత ప్రాచీనులలో కాల యవనుడు ఒకడు. ఆ తరువాత కూడా డెమెట్రియస్, మిన్యాండర్ లాటి గ్రీకుల దాడి జరిగిన రోజులలోనే వారు అయోధ్య వరకు వచ్చినారు. కానీ వారిని తిప్పి కొట్టినారు. తరువాత వచ్చిన అలెక్జాండర్ సింధు నదినే దాట లేక పోయినాడు. ఆయనను నిలవరించినది గుప్త వంశానికి చెందిన సముద్ర గుప్తుడు.(క్షమించాలి, పాశ్చాత్యుల వ్రాతలనే నమ్మే వారు ఇది తెలుసుకోవాలి.)అటు  తరువాత పర్షియా, గ్రీకు దేశాలను ధ్వంసము చేసిన హూణులను స్కంద గుప్తుడు సింధు నదిని దాటి రాకుండా నిలవరించినాడు. కాని విదేశీయులు వ్రాసిన చరిత్రలో ఆయనను , ఆయన విజయాలను పూర్తిగా మరిచి పోయినారు. విక్రమార్కుడు,  శాలి వాహనుడి కాలములో ఈ దేశము కాస్త నిలదొక్కుకున్నది.  క్రీ.శ.౮వ శతాబ్దములో తిరిగి అరబ్బు దేశాలనుండి దాడులు మొదలు అయినాయి.   
ఈ దాడులు జరిగి సుమారుగా వేయి సంవత్సరాలలో వారి ప్రభావములో ఉన్నప్పటికీ భారతీయ సామాజిక ఏకాత్మకత చెక్కు చెదర లేదు. టన్నుల బంగారము కొరకు స్పెయిన్ దేశస్థులు మాయా నాగరిక సమాజమును ఎలా ధ్వంసము చేసినారో అందరికీ తెలుసును. అదే విధముగా భారత దేశములో ఉన్న ఏకాత్మకతను దెబ్బ కొడితే తప్ప ఇక్కడ నిల దొక్కుకో లేమని బ్రిటిష్ వారు భావించి ఆ దారిలో ఎన్నో కుట్రలు చేసినారు. దేశాన్నీ వేర్వేరు వర్గాలుగా విభజించి , వారి మధ్య ద్వేష భావాలను రగుల్కొలిపి తాము స్థిర పడాలని అనుకున్నారు. ఇందుకు ఎన్నో రకాలయిన ప్రణాళికలు వేయ బడినాయి. అందులో ఒక భాగము ఆర్య ద్రావిడ సిద్ధాంత ప్రతిపాదన.
ఈ దేశములో మొదట తురీయులు అనబడే వారు ఉండే వారుట. తరువాత  ద్రవిడులు అనబడే వారు వచ్చి, ఈ దేశాన్నీ ఆక్రమించి ఆ  తురీయులను  కొండల పైకి, అడవుల లోనికి తరిమి వేసినారుట..చివరకు ఎక్కడో ఆసియా మైనర్ నుండి ఆర్యులు అన బడే వారు వచ్చి, ద్రవిడులను దక్షిణ భారత దేశానికి తరిమి వేసి ఉత్తర భారత దేశాన్ని ఆక్రమించుకున్నారుట. అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒకరి వెంబడి ఒకరు వచ్చి పాత వారిని వేరే చోటకు తరిమి వేసే సంప్రదాయము మనకు లేదు. నిజానికి బ్రిటిషు వారు అమెరికా ను ఆక్రమించి రెడ్ ఇండియన్లను అడవుల పాలు చేసినారు. వారి సంప్రదాయాలను నాశనము చేసి వారిని దరిద్ర స్థితికి పంపినారు. అందుకే వారు ఎవరైనా అలాగే చేస్తారనే తత్త్వము లో నుండి బయటకు రా లేరు. ఆ తత్త్వము ఇంకా అలానే ఉంది. ఉదాహరణకు మన దేశములో కథలలో ,చివరకు సినిమాలలో కూడా భూమికి బయట నుండి వచ్చిన వారు భూమి మీద ఉన్న వారితో స్నేహముతో ఉంది , వారికి ఎంతో సహాయము చేసి, వారి నుండి తిరిగి సహాయమును పొందినట్లు ఉంటుంది. కానీ, అమెరికన్లు తీసే సినిమాలలో ఇప్పటికీ తాము మాత్రమె భూమికి రక్షకులయినట్లు, ఇతర గ్రహాలనుండి, మరియు నక్షత్రాలనుంది వచ్చే వారు భూమిని నాశనము చేయడానికి వచ్చినట్లు ఉంటాయి.   Independence day  సినిమా ఒక ఉదాహరణ. ఇంకొక ప్రశ్న. ఆర్యులు అంతకు ముందు ద్రవిడులు  తురీయులను చేసినట్లు వారిని కొండల మీదికి తరిమి వేయ లేదేమి? అందుకు వారు చెప్పే జవాబులు నమ్మ దగినవి గా ఉండవు. ఇటువంటి విచిత్రమయిన సిద్ధాంతాన్ని కోట వెంకటాచలము గారు, మరియు నారాయణ శాస్త్రి గారు ఖండిస్తే, వారికి మాట్లాడే అవకాశము కూడా ఈయ లేదు.
           భారత దేశములో ఋషుల ద్వారా వ్రాయ బడిన పురాణాలలో గతములో పాలించిన రాజుల చరిత్ర తో బాటు భవిష్యత్తులో పాలించే పాలకుల చరిత్ర కూడా ఈయ బడినది.  కానీ ఇందులో కొన్ని ప్రక్షిప్తాలు లేక పోలేదు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే పరంపర కనబడుతుంది. లభ్యమవుతున్న భిన్న ప్రతులను పరిశీలిస్తే ఒకే చరిత్ర కనబడుతుంది. అందులో కొన్ని ప్రధాన సంఘటనలకు అప్పటి గ్రహ నక్షత్ర స్థితులను కూడా వివరముగా ఇచ్చినారు. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానమున్న వారు ఎవరైనను దీనిని అనుసరించి కాల నిర్ణయము చేయ వచ్చును. సప్తర్షి మండలములో చతురస్రము కాక మిగిలిన మూడు చుక్కలను పొడిగిస్తే  అవి  చంద్ర కక్ష్యను తాకే చోట ఉన్న నక్షత్రమును కాలమానముగా వాడుకున్నారు. ఈ బిందువు వంద సంవత్సరాలకు ఒక నక్షత్రము మారునట్లు వరాహ మిహిరుడు చెప్పినాడు. అంతే కాదు. విషువద్బిందువు కాలవ్యవధిని అనుసరించి మారుతుంది. ఈజిప్టు నాగరికత ఉన్నత దశలో ఉన్నపుడు ఇది డ్రాకో అంటే నరక నక్షత్రము లో ఉండేది ఇప్పుడు అది అభిజిత్ అంటే వేగా నక్షత్రములో ఉంది. ఈ లెక్ఖ కూడా కాల నిర్ణయానికి ఉపయోగ పడుతుంది. కానీ ఇవేవీ ఆ నాటి నకిలీ చరిత్ర కారులకు నమ్మ దగినవిగా అనిపించా లేదు.
ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానము గురించి  ఒక (పేరు గుర్తు లేదు. తరువాత చెపుతాను) ఫ్రెంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇలా అంటాడు.”గత ౪౫౦౦ సంవత్సరాలలో హిందువులు గణించి తెలిపిన గ్రహ నక్షత్ర స్తానములు కాసిన్ మరియు మేయర్ ఇచ్చిన పట్టీలనుండి ఒక నిముషము కూడా తేడా చూపించుట లేదు. భారతీయ శాస్త్రజ్ఞులు ఇచ్చిన చంద్రుడి గమనము టైకోబ్రే పరిశోధనలకు సరిపోతుంది. నిజానికి అటువంటి చలనము అలెగ్జాండ్రియా లో శాస్త్రజ్ఞులకు గానీ, అరబ్బు శాస్త్రజ్ఞులకు గానీ తెలియని విషయము. హిందువుల ఖగోళ శాస్త్రజ్ఞానము అతి ప్రాచీనమయినది. ఈజిప్టు, గ్రీకు శాస్త్రజ్ఞులే గాక యూదువులు కూడా ఖగోళ  రహస్యాలను అక్కడ నుండే గ్రహించినారు. కాని, భారతీయులు గ్రీకుల నుండి ఖగోళ శాస్త్ర విజ్ఞానము గ్రహించినారన్న ప్రచారము అందరి మనసులలో చొచ్చుకొని పోయినది. సమగ్రముగా పరిశీలిస్తే ఈ ప్రచారము ఎంతగా సత్య దూరమో తెలుస్తుంది.”
భారతీయ చారిత్రక సత్యాలు మార్చి వేయుటకు ఎన్నో ప్రయత్నాలు జరిగినవి. కొన్ని సంఘటనలను జరగనే లేదన్నట్లు తీసి వేసినారు. కొందరు చారిత్రక పురుషులు అసలు లేరని నమ్మించుటకు ప్రయత్నించినారు.(ఇది మరొక చోట వివరించ బడుతుంది) తమ అభిప్రాయాలు బల పరచుటకు సరికొత్త ఋజువులు కల్పించినారు.
 విలియం జోన్స్ అను పేరు గల బ్రిటిష్ చరిత్ర కారుడు భారత దేశ చరిత్ర యొక్క పునర్నిర్మాణమునకు విష్ణు పురాణమును ఆధారము చేసుకొని పరిశీలించినాడు. తన పరిశీలన లో మౌర్య చంద్ర గుప్తుడు కలి యుగాబ్ది ౧౫౬౮ లేదా క్రీస్తు పూర్వము ౧౫౩౪ లో పరిపాలన చేసినట్లు నిర్ణయించినాడు. అంతే గాక అలెగ్జాండర్  దండ యాత్రకు ౬౦౦ సంవత్సరాల ముందు నుండి  మన సమీప దేశము బాక్ట్రియా ను పాలించిన వారి వంశ వృక్షము (dabistaan Document) ను  కూడా ప్రకటించినాడు. తరువాత అతడి మీద ఎటువంటి వత్తిడులు వచ్చినాయో తెలియదు. హఠాత్తుగా ఈ చరిత్ర కాలములు నమ్మ దగినవి గా లేవని అన్నారు.  యూరప్ లో తయారయిన ఒక రహస్య ప్రణాళికను అనుసరించి భారతీయ చరిత్ర కాలములను తారు మారు చేయుటకు పూనుకున్నాడు.

         

Monday, November 7, 2016

మన చరిత్ర 1

                                                   
నన్ను వర్తమానములో నడిపిస్తున్న మహాత్ములకు, భవిష్యత్తులో నడిపించే  మహాత్ములకు ప్రణామములు.
పల్లెటూరిలో పుట్టి, ప్రకృతి రసాస్వాదన చేస్తూ కొత్త కొత్త మార్పులలో ప్రవేశిస్తూ, దీనిని వ్రాయుటను మొదలు పెట్టినాను. ఈ నాడు  ప్రతి యొక్కరు నేను/మీరు/ఎందరో  చెపుతున్నారు, లోకమంతా పాడయి పోయిందని, ప్రతి యొక్కరి లో స్వార్థము పెరిగి పోయిందని. ఈ చెప్పడముతో తమ భాద్యత తీరి పోయిందని అందరూ పక్కకు తప్పుకుంటున్నారు.
          గౌతమ బుద్ధుడిని కొంత మంది ప్రశ్నించినారు, ”మరణానంతర జీవితముండా?” అని. ”ఈ జీవితమును పట్టించు కొనండి” అని ఆయన జవాబు ఇచ్చినారు. మిగిలిన విషయాలు ఇప్పుడు అనవసరము అని ఆయన ఉద్దేశ్యము. వారు వెంటనే వ్రాసుకున్నారు,” బుద్ధుడి ప్రకారము మరణానంతర జీవితము లేదు.” అని. కొన్ని పాఠ్య పుస్తకాలలో ఇవే పాఠాలు చెపుతున్నారు. ఇక  బుద్ధుడు చెప్పిన జాతక కథలు పునర్జన్మను గూర్చి చెబుతూనే ఉన్నా వారికి వినిపించవు. లలిత విస్తారము అన బడే బౌద్ధ మత గ్రంథము లో బుద్ధుడు తన గత జన్మ గురించి చెబుతాడు. టిబెట్ లో బౌద్ధ మత గురువులు అయిన లామాలు తమ గత జన్మలు, పునర్జన్మలను గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. కాని మన దార్శనికులు బౌద్ధము తిరిగి జన్మను నమ్మదని ఘంటా పథముగా చెప్పి వేస్తుంటారు.
గురువులు పూర్వ కాలము శిష్యులకు ఎంత అవసరమో అంత వరకే బోధించే వారు. కానీ ఈ నాడు శిష్యులు “గురువు గారూ! మీరు చెప్ప గలిగినంత చెప్పండి. అందులో మేము ఏరుకొన కలిగిన విషయాలను ఏరుకుంటాము” అంటున్నారు. వీరే నిజమయిన గురువును మించిన శిష్యులు. ఇందులో మరొక ఉప శాఖ ఉన్నది. “గురువు గారూ! అన్నీ చెప్పి ఉపయోగము లేదండి. మాకు మీరు పెట్ట   బోయే పరీక్షకు ఎంత అవసరమో అంతే చెప్పండి” అనే మేధావులు కూడా తయారు అయినారు. ఇంకా గురువులకే పరీక్ష పెట్టె మరో శాఖ ఒకటి తయారు అయింది. ఏమయినా కాస్త తెలివి తేటలకు పరీక్ష పెట్టె ప్రశ్న పరీక్షలో వస్తే ఇది అసలు పాఠ్య ప్రణాళిక లోనే లేదు. అందుకని ఆ ప్రశ్నను  ఉంచకండి లేదా దానికి ఊరకే మార్కులు ఇచ్చి వేయండి అని చెప్పే విద్యారంగానికి సంబంధించని  బడుద్ధాయిలు తయారు అయినారు. ఇంక సరి అయిన విద్య ఎక్కడనుండి వస్తుంది? చివరకు శిష్యులకు ఏమి చెప్పాలో తెలియని గురువు, తనకు నచ్చిన పాఠాలే చెప్పాలనే శిష్యులు తయారవుతున్నారు. వీళ్ళందరికీ తెలియని విషయము గణితము లో మహా మేధావి అయిన రామానుజం  ఇంటర్ లో ఉత్తీర్ణుడు కాలేదని, మనము వాడుతున్న ఆల్టర్నేట్ కరెంట్ ను ప్రవేశ పెట్టిన టెస్లా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరము మించి చదువ లేదని.

విద్యా విధానమని  అనగానే మనకు శీలము  గుర్తుకు వస్తుంది. విద్య ఒసగును వినయంబు  అనేది మన సూక్తులలో ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చే సాధారణ మయిన ప్రశ్న ఒకటే. శీలము విద్య లో భాగమా కాదా?  అలా కాక  పొతే పైన సూక్తులకు విలువ ఉన్నదా?
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మన పద జాలానికి అర్థమే మారి పోయింది.
ఈ క్రింది సంఘటన కొన్ని సంవత్సరాల క్రిందట జరిగింది. ఒక రోజు గ్రంథాలయములో కూర్చొని వార్తా పత్రిక చదువుతున్నాను. ఎదురుగా ఇరువురి మధ్య ఎదో తీవ్రమయిన చర్చ జరుగుతున్నాది.  కంఠముల తీక్ష్ణత బాగా పెరిగింది. అంతా వింటున్నాను. ఒక రచయిత్రి గురించి చాలా తీవ్రముగా చర్చ జరుగుతున్నది. వ్యక్తిగత శీలమును వదిలి వేసిన వ్యక్తీ ఎన్ని నీతులు చెప్పినా సమాజానికి ఒరిగేదేమిటి? ఇది మొదటి వాడి ప్రశ్న.
వ్యక్తిగత విషయములతో మనకు సంబంధము లేదు. సమాజానికి ఆమె చేసిన అద్భుతము అయిన రచనలను మాత్రమే మనము తీసుకోవాలి అంటాడు మరొక వ్యక్తీ. ఇరువురు జుట్టు పట్టుకొనే స్థితి వస్తే అందరూ వారికి సర్ది చెప్పి బయటకు పంపించినారు. ఈ సందర్భములో నాకు కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి.
చిన్నప్పుడు (నా ఏడవ తరగతిలో ) ఒక సైన్స్ మాస్టర్ అద్భుతముగా పాఠాలు చెప్పే వారు. పిల్లలు అసలు శబ్దము చేసే వారు కాదు ఆయన క్లాసు లో. ఒక సారి అతడి వ్యక్తిగత జీవితములో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినవి. అంతే. అప్పటి నుండి ఆయన ఎంత బాగా చెబుతున్నా, పిల్లలు పాఠాలు వినుట మాని, గొడవ చేయుట మొదలు పెట్టినారు. ఇది ౧౯౬౪ నాటి మాట. ఎందుకలా జరిగింది?
మనము ఎన్ని నీతులు చెప్పినా విద్యార్థులు జాగ్రత్తగా వింటారు. అంతే కాదు మన నడవడికను బాగుగా గమనిస్తూనే ఉంటారు. మనము నియమాలను పాటించనప్పుడు వారు మనలను వినడము మాని వేస్తారు.
మరొక ఉదాహరణ  “సారా జహాన్ సే అచ్చా” పాట వ్రాసి మనలను మెప్పించిన ఇక్బాల్ మహాశయుడు పాకిస్తాన్ కు జారుకున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే కల్లు తాగకురా అని పాట  వ్రాసి ఆ పాట గొప్పతనానికి సన్మానము చేయించుకొని చివరకు సంతోషము పట్ట లేక కల్లు పాకలో దూరినట్లు ఉంటుంది. నిజముగా ఆ పాటలో ఉన్న ఉద్వేగము ఉంటే ఇలా చేసే వాడు కాదు. అందుకే  కవిత్వము వ్రాసినంత మాత్రాన అది వారిలో ఉన్నట్లు కాదు. వాళ్ళు మాటల గారడీ వాళ్ళు  మాత్రమె.
బంకిం బాబు ‘వందే మాతరం” గీతాన్ని తన ఆనంద మఠములో వ్రాసి దేశ ప్రేమికుల చేత పాడించినాడు. తను దేశ ప్రేమికుడిగా జీవించినాడు. అందుకే వందే మాతరం యొక్క స్థాయి మొదటి గీతానికి రాదు. పై విషయాలను గమనిస్తే మనకొక విషయము తెలుస్తుంది. శీలము లేని వాడు నటిస్తాడు, శీలమున్న వాడు జీవిస్తాడు. మనకు కావలసినది నటనా? జీవనమా?

అయోధ్య రాముడిని రోజూ తలచుకుంటారు కొంత మంది. మరికొందరు రాముడు అయోధ్యలోనే పుట్టలేదన్న వారు ఉన్నారు. కాదు కేరళ లో ఉన్న అయోధ్యలో పుట్టినాడన్నారు, కాదు, కాదు, తాయిలాండ్ లో ఒక అయోధ్య ఉన్నది అక్కడే పుట్టినాడని అన్నారు ఇంకొకరు. ఇంకొక సరికొత్త ప్రతిపాదన ఏమిటంటే  గాంధార దేశములో కూడా ఇంకో అయోధ్య ఉందిట.  అక్కడయితే అసలు కట్ట లేరు కదా అనుకోని ఉంటారు పిచ్చి వాళ్ళు. ఇవి అన్నీ వారు వోట్ల కోసము పడే పాట్లు. దురదృష్టమేమిటంటే విజయ వాడలో కూడా ఒక అయోధ్య నగర్ అనే ప్రాంతముంది.  అది వారి దృష్టికి ఎందుకు రాలేదా? అనిపించింది. దుర్గమ్మ ప్రాంగణ మయిన విజయవాడకు అంత అర్హత లేదనుకున్నారేమో? ఆ సెక్యులరిస్టులు.

Saturday, September 10, 2016

ఈశావాస్య ఉపనిషత్తు

                       

వేదములు అన్నీ యథార్థమునకు  ప్రతీకలు అయితే  ఉపనిషత్తులు  వేద తత్వాన్ని మానవ జాతి దగ్గరకు చేర్చే ప్రణాళికలు.  కొంత మంది అనెదరు ,” ఉపనిషత్తులు  కొన్ని సత్యాలను బోధిస్తుంది.  వేదాలు చేస్తున్నది  కూడా ఇదే కదా.  మరి ఉపనిషత్తుల ప్రత్యేక ప్రయోజనము ఏమిటి?”, అని.  ఈ కోణములో  ఆలోచిస్తే మనకు మరి కొన్ని సత్యాలు బోధ పడతాయి.  సత్యాలను సత్యాలుగా బోధించే ది వేదాలు.  సత్యాలను అనుభూతి  లోనికి తీసుకొని వచ్చేది ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తులు ఒక సాధనా స్వరూపము.  ఈ విషయాన్నే సత్య సాయి బాబా తమ భక్తులకు  బోధించినవారు.
ఈశుడు, ఈశ్వరుడు, ఈశానుడు, పరమాత్మ   ఇన్ని పేర్లతో ఉంటూ  ఉన్న ఆయన ఎవరు? ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఆయనను ఎలా అనుభూతి చెందాలి? అన్నీ ప్రశ్నలే. కానీ మన లక్ష్యము కూడా అంత  వరకే . అంతే  కానీ అంతు  లేని తర్కముతో మన మనస్సులో ఒక వల వేసి ఆయనను పట్టుకోవాలని అను కోవడము ఒక వృధా ప్రయాస.
ప్రతి ఉపనిషత్తుకు ముందు శాంతి  మంత్రాలు ఉంటాయి. ఇవి  లోక క్షేమానికి మనము చేసే ప్రార్థన మాత్రమే కాక మన మనస్సును కూడా తృప్తి పరుస్తాయి.

ఓం  పూర్ణ  మదః  పూర్ణ  మిదం
        పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే ।
పూర్ణస్య  పూర్ణ  మాదాయ
        పూర్ణ  మేవావ  శిష్య తే ॥  


ఓంకారము  లేకుండా    మంత్రమూ  ఉండదు.ఓం  ఇతి ఏకాక్షరం  బ్రహ్మా “  అని వేద సూక్తము.  అందు వలన    మంత్ర మయినా ఓంకారము తోనే మొదలవుతుంది . ఇంక  పూర్ణ  మదః అంటే అది పూర్ణము  అయినది అని అర్థము. అంటే పూర్తి గా ఉన్నది అని అర్థము. అది అంటే మనము  కాకుండా దూరము  గా ఉన్నది అని అర్థము. ఇంక ఇదం  అంటే మనకు కనిపిస్తున్న ది, మనకు తెలుస్తున్నది, మనకు అందు బాటు  లో  ఉండేది ,మన చుట్టూ  ఉండేది, ఇది కూడా పూర్ణమే . పూర్ణాత్  () పూర్ణము (అంటే పర బ్రహ్మము ) నుండి  పూర్ణం   ఉదచ్యతే  అంటే (  పూర్ణము ) మన మున్న  విశ్వము ఉత్పన్నము అవుతున్నది.  అంతే  కాదు. పూర్ణస్య  పూర్ణమాదాయ అంటే   పూర్ణము నుండి పూర్ణమును గ్రహిస్తే  పూర్ణం  ఏవ అవ  శిష్య తే పూర్ణము మాత్రమె మిగులుతుంది. అంటే ఆ విశ్వము ఉత్పన్నమయిన  తరువాత పూర్ణము లో ఏ తగ్గుదల ఉండదు.
ఉదాహరణకు విశ్వము ఏర్పడినపుడు మూలములో  ఉన్న శక్తిలో    విధముగా గుర్తించ గలిగిన మార్పు ఉండ దు .  సముద్రములో నుండి   చెంబుతో  నీరు తీసుకున్నను సముద్రములో    విధమయిన మార్పు కనిపించదు.
ఇంక ఉపనిషత్తు లోనికి పోదాము.
మొదటి  మంత్రము:
ఈశా వాస్య మిదం  సర్వం
                    యత్కించ  జగత్యాం  జగత్ ।
తేన  త్యక్తేన  భుంజీధా
                     మా గృధః  కస్య  స్విద్ ధనమ్ ||

ఇదం సర్వం ఈశావాస్యం.
యత్కించ జగత్యాం జగత్..
తేన త్యక్తేన భున్జీథా.
కస్య స్విద్ ధనం మా గృధః.


ప్రళయ  కాలే  గచ్చతి  ఇతి జగతి. లయము చెందు నపుడు  వెళ్లి పోయేది  తరువాత సృష్టి  తో తిరిగి వచ్చేది.  ఈశా వాస్యము అంటే ఈశ్వరుడి  యొక్క  ఆవాస్యము  అంటే ఈశ్వరుడి చేత వ్యాపించ బడినది . ఏది? ఇదం సర్వమ్. అంటే మనమున్న భౌతిక రూపము  లో ఉన్న లోకము. యత్కించ  అంటే ఏది అయితే  జగత్యాం జగత్. అంటే జగత్తు నుండి వచ్చిన జగత్తు అంటే విశ్వము . అంటే బ్రహ్మాండము  నుండి వచ్చిన భౌతిక లొకము.  తేన  దానిని త్యక్తేన భుంజీధా అంటే వదిలి వేసినట్లు లేదా ఏ  బంధము లేనట్లు ఉంటూ  లేదా త్యాగ భావముతో  భుంజీధా  అంటే అనుభవిం పుము.  కస్య స్విద్ మా గృధః ధనమ్  . కస్య స్విద్ ఎవరిది అయినా  ధనము పై  మా గృధః  ఆసక్తి చూపకుము.
ఇది చాలా ముఖ్యమయిన సాధన.  మనకు వచ్చిన ధనము భగవంతుడి  అనుగ్రహము ద్వారా వచ్చినది.  దానికి మనము ధర్మ కర్తలము మాత్రమే. ధన నిర్వహణను భాద్యత గా స్వీకరిస్తూనే ధర్మ కర్తననే భావముతో ఉండుము .ఇది నాది, దీనిని నేను సంపాదించాను అన బడే  బంధాన్ని వేసుకో  వలదు.  భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడనుకున్నపుడు  సమస్త జీవ రాశులను భగవంతుడి  రూపముగా భావిస్తాము. ఈ విధముగా సమస్త జీవ రాశి  మీద మనకు ప్రేమ కరుణ ఏర్పడతాయి . ఈ అర్థము ఆచరణ  లోనికి వస్తే విశ్వమంతా శాంతి వెల్లి  విరుస్తుంది .
అంతే  కాదు. మన సంప్రదాయములోధనమగ్నిః  ధనం వాయు  దానం భూతాని పంచచఅని చెప్పబడినది. అంటే పంచ భూతాల స్వరూపము అయిన పరిసరాలను  ధనముగా భావించాలి. అందు వలన తన స్వార్థము కొఱకు పరిసరాలను  పాడు చేసే వాడిని కూడా  దొంగ గానే భావించాలి. పతంజలి యోగ సూత్రాలలో కూడా  ఆధ్యాత్మికముగా ముందుకు వెళ్ళ వలసిన వాడు అస్తేయ  బుద్ధిని అవలంబించాలి, అంటే దొంగ బుద్ధి ఉండకూడదు అని చెబుతారు. తనది కాని దానిని తనది గా భావించుట నే  స్తేయ బుద్ధి అంటారు
కానీ ఎటువంటి పరిస్థితుల లోను భాధ్యతను వదిలి పెట్ట కూడదు.

రెండవ   మంత్రము:

కుర్వ న్నేవేహ  కర్మాణి
                   జిజీవిషే చ్చతః సమాః ।  
ఏవం  త్వయి నా న్య ధే తోస్తి
           కర్మ లిప్యతే  నరే ||  

కుర్వన్ ఏవ ఇహ కర్మాణి
శతః సమాః జిజీవిషే త్
ఏవం త్వయి న అన్యథా అతః ఆస్తి
స కర్మ నరే లిప్యతే

కుర్వన్నేవేహ కర్మాణి  శతః సమాః --  కర్మాణి  కుర్వన్ ఏవ ఇహ కర్మలను (ఇహ) ఈ లోకమునందు  చేస్తూనే శతః సమాః  నూరుకు  మానమయిన సంవత్సరాలను  జిజీవిషే త్  జీవించుటకు కోరుకొన వలెను . ఏవం  ఈ విధముగా త్వయి  నీకు  నః  అన్యధః అతః ఆస్తి - మ రో రకము గా  ఏమియు లేదు  సః  అటువంటి  కర్మ   మానవుడిని  న లిప్యతే  బంధించదు .
విధి యుక్తమయిన కర్మాచరణ చేస్తూ  నూరుకు సమానమయిన సంవత్సరాలను కోరుకోవలెను .మరో విధముగా ఏమియూ  లేదు . అటువంటి కర్మ మానవుడిని బంధించదు .
సాధన: కష్టాలు వచ్చినాయి కాబట్టి  ఈ జీవితమూ బాగు లేదని,  చేయ వలసిన పనులు నచ్చ లేదని, నైరాశ్యమును పొందకూడదు . మన  పరిణామమును  అనుసరించి  మనకు ఆచరణ  విధానము లభిస్తుంది .  దానిని శ్రద్ధగా , భాద్యతగా  చేస్తే  తరువాత ఏమి చేయాలో తెలుస్తుంది . అంతే  కానీ ఒకే  సారి అన్ని మెట్లు ఎక్కి వేయాలన్న భావన తప్పే. ఒక్కొక్క మెట్టే  జాగ్రత్తగా ఎక్కాలంటే  పైన చెప్పిన మానసిక స్థితి ఉండాలి .

మూడవ  మంత్రము:

అసూర్యా  నామ తే  లోకా
                అంధేన  తమసావృతా ।
తాస్తే  ప్రేత్యాది గచ్చంత
                 యే కే  చాత్మ హానో  జనాః ॥

అసూర్యా నామ తే లోకా
అంధేన తమసావృతా
యే కేచః ఆత్మహనః జనాః
తాః తే ప్రేత్య అభిగచ్చంతి


ఇక్కడ మూలము  లో ఆసూర్య  అని ఇచ్చి,  దగ్గిర అసుర్య అని ఇచ్చినారు.  అసుర శబ్దము  నుండి  అసుర్య వచ్చింది.  సూర్య  రాహిత్యము నుండి  అసూర్య  శబ్దమువచ్చినది.  అసురులు  భౌతిక వాదానికి  ప్రాధాన్యత ను ఇచ్చే వారు. అయితే  సూర్యుడు ప్రజ్ఞకు  మూలము. అసూర్య  అంటే  సూర్యుడు లేనిది  అంటే ప్రజ్ఞ లేనిది.  అసురులుండే  లోకము తమసావృతము , లేదా చీకటితో నిండినది  కానవసరము లెదు. కానీ, సూర్యుడు లేని లోకము మాత్రము  అందు  వలన అంథేన అంటే గ్రుడ్డి తనము వలన తమసావృతమే అంటే చీకటి తో నిండినది.
యే కేచ అంటే ఎవరయితే ఆత్మ హనః అంటే ఆత్మను చంపుకున్న వారు అనే కంటే ఆత్మ తత్వమును చంపుకున్న వారు అనుట సబబు గా ఉంటుంది. జనాః అటువంటి జనము అసూఠ్యాః నామ అంటే సూర్యుడు లేనటువంటి అంథేన తమసావృతాః గ్రుడ్డి తనము వలన చీకటి తో నిండిన తేః లోకాః అంటే ఆ లోకములను ప్రేత్య అంటే మరణించి అభిగచ్చంతి అంటే మరల మరల పొందుతున్నారు.
తాత్పర్యము: ఆత్మ ద్రోహము చేసుకున్న వారు మరణము తరువాత సూర్యుడు లేని అజ్ఞాన అంధ కారములతో కూడిన లోకములకు పోయి మరల మరల అవే లోకములను పొందెదరు.
వివరణ: వేర్వేరు లోకములన్నీ ఒక దానితో ఒకటి కలసే యుండును. తక్కువ స్థాయి జీవితమును గడిపిన వారు అందుకు తగినట్లు గా తక్కువ స్థాయి పౌనఃపున్యము కలిగిన చీకటి లోకములకు పోయి తాము ఉత్తమ పరిణామ స్థాయికి ఎదిగే వరకు అక్కడికే పోవుచుండెదరు. మానసిక స్థాయి ఎదిగితే అందుకు తగిన సత్కర్మ చేసి ఉత్తమ లోకములను పొందెదరు.

నాల్గవ మంత్రము:
అనేజదేకం మనసో జవీయో
నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్ |
తద్దావతోsన్యానత్యేతి తస్మత్
తస్మిన్నపో మాతరిశ్వా దదాతి ||

ఏకం మనసో జవీయో అనేజత్
న ఏనః దేవాః పూర్వమర్షత్ అప్నుఫన్
తత్ అన్యాన్ అత్యేతి దావతి
తత్ తిష్టతి
తస్మిన్ మాతరిశ్వా ఆపః దధాతి

ఏకం అంటే అతడు ఆ పరమేశ్వరుడు మనసో జవీయో అంటే మనసు కంటే వేగముగా జవీయో అంటే వెళ్ళ గలడు. ఏనః అంటే దీనిని దేవాః దేవతలు పూర్వమర్షత్ ఈ ప్రాచీనమయిన జ్ఞానమును న అప్నువన్ పొంద లేక పోయినారు.అన్యాని అత్యేతి ధావతి అంటే ఇతరులను అతిక్రమించి పరుగెట్ట గలదు. తిష్టతి అంటే కదలకుండా ఉండ గలదు. తస్మిన్ ఇందు వలననే మాతరిశ్వా వాయువు లాంటి దేవతలు ఆపః జలమును లేదా వర్షాదులను దదాతి సమకూర్చ గలిగినారు.
తాత్పర్యము: తను స్థిరముగా ఉంటూనే మనస్సు కంటే ఎక్కువ వేగము కలిగిన వాడు. అతడి జ్ఞానమును ఇంద్రాది దేవతలు కూడా పొంద లేక పోయినారు. తను స్థిరముగా ఉంటూనే అత్యంత వేగముగా సాగుతున్న ఇతరులను దాటి పోగలడు అతడి ఉనికి వలననే వాయువు లాంటి దేవతలు వర్షము సమకూర్చ గలుగుతారు.

ఆధునిక విశ్వాసమును అనుసరించి ఒక వివరణ: ఏ కణము కూడా వేగము పెరిగే కొద్దీ దాని వ్యాపకత కుంచించుక పోతుందనేది ఆధునిక విజ్ఞానములో తెలిసిన విషయము. వేగము శూన్యము అయినపుడు దాని వ్యాపకత అనంతము వరకు పెరుగుతుంది. ద్రవ్యము యొక్క తరంగ దైర్ఘ్యము దాని వేగమునకు విలోమ నిష్పత్తిలో ఉంటుంది. (ఆధునిక కాలములో దీనిని గమనించినది లూయిస్ డీ బ్రాగ్లీ). అంతే గాక ఒక్క చోటనే కూర్చుని అనంత విశ్వములో ఎక్కడ ఏమి జరుగుతుందని తెలుసుకో గలిగిన యోగి కూడా ఈ ఆధారము మీదే పని చేస్తాడు. ఆల్ఫా ధ్యానము లాంటి ప్రక్రియ ఇటువంటి ఫలితాలని ఈయ గలదు. స్థిరముగా యున్న ఈశ్వరుడు అంతటను వ్యాపించి అంతటను తనలో ఇముడ్చుకో గలదు.
శివ సహస్ర నామములలో మొదటి నామము స్థిరుడు. తను స్థిరముగా యుంటూ సర్వమును గమనించ గలుగుట ఒక అద్భుత సాధన. విజ్ఞాన భైరవ తంత్రములో కూడా ఈ విషయము చెప్ప బడి యున్నది.

అయిదవ మంత్రము:
తదేజతి తన్నైజతి.
తద్ దూరే తద్వంతికే |
తదంతరస్య సర్వస్య
తదు సర్వస్యాస్య బాహ్యతః ||

తత్ ఏజతి తత్ న ఏజతి
తద్ దూరే తద్ అంతికే
తద్ అంతరస్య సర్వస్య
తత్ సర్వస్య అస్య బాహ్యస్య

తదేజతి అతడు నడుస్తాడు. తత్ న ఏజతి. అతడు నడువదు. తత్ దూరే అతడు దూరములో ఉన్నాడు. తత్ అంతికే అతడు సమీపములో కూడా ఉన్నాడు. తత్ అంతరస్య సర్వస్య సమస్త జగత్తు లో లో లోపల ఉన్నాడు. తత్ సర్వస్య అస్య బాహ్యస్య. అతడు అన్నిటికి బయట కూడా ఉన్నాడు.
తాత్పర్యము: ఆ పరమ పురుషుడు నడుచును, నడవడు,చాల దూరముగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. జగత్తు లోపల జగత్తుకు బయట పరిపూర్ణముగా ఉన్నాడు.
వివరణ: పరిస్థితులు ప్రవర్తనను నిర్దేశిస్తాయి, కానీ భగవంతుడు ఎప్పుడూ ఒకే రకముగా ఉంటాడు. సగుణ రూపములో తీసుకుంటే నడచినట్లుంటాడు. నిర్గుణ రూపములో చలనముండదు. నమ్మకము లేని వాడికి దూరముగా ఉంటాడు, భక్తులకు దగ్గిరగా ఉంటాడు. జగత్తుకు లోపల బయట అన్ని చోట్లా ఆయనే ఉంటాడు. ఆయన సర్వ వ్యాపి.
ఆరవ మంత్రము:
యస్తు సర్వాణి భూతా
న్యాత్మనే నాను పస్యతి |
సర్వ భూతేషు చాత్మానం
తతో న విజుగుప్సతే ||

యః తు ఎవరయితే సర్వాణి భూతాని సమస్త జీవ రాశులను ఆత్మన్యే పరమాత్మ యందు అనుపశ్యతే దర్శించ గాలుగుతున్నాడో అతడు సర్వ భూతేషు ఆత్మానం సకల ప్రాణులందు పరమాత్మనుచూస్తాడు. తతః తరువాత విజుగుప్సతే ద్వేషించడు.
తాత్పర్యము: సకల జీవులను పరమాత్మ యందు చూచు వాడు మరియు సకల జీవుల యందు పరమాత్మను చూచు వాడు ఏ జీవిని ద్వేషించడు.
ఈ విధముగా జీవించుట ఒక అద్భుతమయిన సాధన.

ఏడవ మంత్రము:
యస్మిన్ సర్వాణి భూతాని
ఆత్మనా భూ ద్విజానత |
తత్ర కో మోహః కో శోకః
ఏకత్వ మను పశ్యతి ||
యస్మిన్ ఎప్పుడయితే సర్వాణి భూతాని సకల ప్రాణులను ఆత్మ ఆభూత్ పరమాత్మ స్వరూపముగా విజానతః విశేషముగా తెలుసుకున్నపుడు అస్మిన్ ఆ స్థితిలో తత్ర అక్కడ కో మోహః మోహమేక్కడిది? కో శోకః శోకమేక్కడిది?ఏకత్వం అనుపశ్యతి ఒకే తత్త్వము చూస్తాడు.
తాత్పర్యము: సకల ప్రాణులను పరమాత్మ స్వరూపముగా తెలిసిన స్థితిలో అక్కడ మోహము ఎక్కడిది? శోకము ఎక్కడిది? అక్కడ ఏకత్వ స్థితిని అనుభవిస్తాడు.
ఇది అద్వైత భావానికి పరాకాస్థ.

ఎనిమిదవ మంత్రము:
స పర్యగా చ్చుక్ర మకాయ మవ్రణం
అస్నావిరః శుద్ధ మాపాప విద్ధం |
కవిర్మనీషీ పరిభూః స్వయం భూర్యాథా
తథ్యతోర్ధాన్ వ్యదధా చ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||


సః అతడు పర్యగాత్ సర్వ వ్యాపి అవుతాడు. శుక్రం తేజస్సు కలిగిఉంటాడు. అకాయం నిర్గుణ స్వరూపుడుగా ఉంటాడు. అవ్రణం గాయములు లేకుండా ఉంటాడు అస్నారం నరములు లేని వాడుగా ఉంటాడు. శుద్ధం శుభ్రముగా ఉంటాడు.అపాప విద్ధం కర్మ దోషములు లేని స్థితిని పొందును. కవి అన్నిటినీ చూడ గలుగును మనీషీ జ్ఞానిగా ఉందును పరిభూః అందరికంటే గొప్ప వాడుగా ఉందును స్వయంభూః స్వయముగా ప్రకటించుకొన గలిగిన వాడుగా ఉందును శాశ్వతీభ్యః శాశ్వతమయిన వాడుగా ఉందును.యథాతథ్యత ఉండ వలసిన రీతిలో అర్ధాన్ పదార్థములను శాశ్వతీభ్యః అనాది అయిన సమాభ్యః కాలమునుండి వ్యదథాన్ ఏర్పాటు చేయుచుండును.
తాత్పర్యము:ఈ విధముగా సమస్త జీవులలో భగవంతుడిని చూడ గలిగిన వ్యక్తీ తేజస్సుతో దేహ భ్రాంతి వదలి స్నాయువులు గాయములు లేని వాడయి పరమేశ్వరత్వమును పొందును. అతడు అన్నిటిని చూడ గలదు, తెలుసుకోన గలదు, స్వయముగా ప్రకటించు కొనగలడు, శాశ్వతుడు, సమస్త ప్రాణులకు కావాల్సిన పదార్థములను అందించ గలడు.
ఇది ఆ మార్గములో వెళ్ళు వ్యక్తీ అందుకొనే స్థితిని తెలియ చేస్తుంది.

తొమ్మిదవ మంత్రము:
అంధం తమః ప్రవిశంతి
యే s విద్యాముపాసతే |
తతో భూయ ఇవ తే తమో
య ఉ విద్య యా రతాః ||

యః అవిద్యా ముపాసతే ఎవరయితే అవిద్యా మార్గమును ఉపాశిస్తారో వారు అంధం తమః ప్రవిశంతి చీకటి లోకాలలో ప్రవేశిస్తారు. యే విద్యాయాగ్ం రతాః ఎవరయితే విద్య మార్గము నందు ఆసక్తులై ఉంటారో తే వారు తతో భూయ ఇవ తమః అంత కంటే చీకటి లోకాలను ప్రవేశించెదరు. ఇక్కడ అవిద్య మార్గము అంటే కర్మ మార్గము. యఙ్ఞ, దాన, తపో కర్మలను ఈ మార్గములో ఆచరించు వారు చీకటి లోకాలలో ప్రవేశించెదఠు. ఇది అవిద్యా మార్గము అంటే వారు స కాములై అంటే తమ కోరికల కొరకు ఎన్నుకొన్న మార్గము అవుతుంది. పై కర్మలు నిష్కామముగా చేసినపుడు మరో రకముగా ఉంటుంది. మరి విద్య యందు రతులయిన వారు ఇంతకంటే చీకటి లోకాలలో కి పోవడము ఏమిటి? ఈ విషయములో వివరణలో వైవిధ్యము కాన బడుతున్నది. ఇక్కడ ఒకే ఒక్క పదము రతాః ఆ వైవిధ్యమును తోసి పుచ్చుతుంది. అంటే జ్ఞాన మార్గము కూడా అవసరాన్ని మించిన ఆసక్తితో అనుసరించిన వారు కూడా బంధాలలో చిక్కుకుంటారు. వారిలో తమకు అన్నీ వచ్చు అన్న అహంకారము కలుగ వచ్చును. లేదా లోకానికి అవసరమయిన క్రతువులను వారు నిరసించ వచ్చును. ఈ విధముగా రెండు మార్గములలో భంగ పాట్లు ఉన్నవి. రెండు మార్గములలో తుల్యతను పాటించిన వారికి ఎటువంటి సమస్యలు ఉండవు.
తాత్పర్యము: కర్మ మార్గమును స కామముగా ఆచరించు వారు చీకటి లోకములలో కి పోవుదురు. జ్ఞాన మార్గములో అత్యంత ఆసక్తి తో ఉన్న వారు కూడా బంధనాలలో చిక్కుకొని మరింత చీకటి లోకాలలోకి పోవుదురు.
పదియవ మంత్రము:

అన్య దేవాహుర్విద్యయా
న్యదాహురవిద్యయా |
ఇతి శుశ్రుమ ధీరాణాం
యేనస్తద్ విచచక్షిరే ||

విద్య యా అన్యత్ ఎవ ఆహు జ్ఞాన మార్గము ద్వారా అన్యత్ అంటే వేరే ఫలమును ఆహు అంటే చెప్పెదరు. అవిద్యయా కర్మ మార్గము ద్వారా యదాహు ఇదే విధముగా అంటే వేరే ఫలమును చెప్పెదరు.ఇతి అంటే ఈ విధముగా (మేము ) ధీరాణామ్ బుద్ధి మంతుల ద్వారా శుశ్రుమ విన్నాము. తత్ దానిని యేన మాకు విచచక్షిరే వివరించి చెప్పినారు.
తాత్పర్యము: మేము బుద్ధిమంతుల ద్వారా విన్న దాని ప్రకారము కర్మ మార్గము ద్వారా ఒక రక మయిన ఫలితములు జ్ఞాన మార్గము ద్వారా వేరొక రకమయిన్ ఫలితములు వచ్చును. దీనిని వారు వివరించి చెప్పిరి.


పదకొండవ మంత్రము:

విద్యాం చా విద్యాం చ
యస్తద్వేదోభయం సహః |
అవిద్యయా మృత్యుం తీర్త్వా
విద్యయామృత మశ్నుతే ||

విద్యాం చ విద్య అంటే జ్ఞాన మార్గము మరియు అవిద్యాం చ అవిద్య మార్గము అంటే కర్మ మార్గము యః తః ఏదో అది ఉభయం రెండింటిని వేద తెలుసు కున్న వారు అవిద్యయా కర్మ మార్గములో మృత్యుం మరణాన్ని తీర్త్వా దాటి విద్య జ్ఞాన మార్గము ద్వారా అమృత మశ్నుతే అమృతత్వమును పొందెదరు.
తాత్పర్యము: ఎవరయితే విద్య మరియు అవిద్య మార్గములు రెండింటిని గురించి తెలిసి ఆచరిస్తారో వారు మొదటి (కర్మ ) మార్గము ద్వారా మృత్యువును దాటుతారు. విద్య అంటే జ్ఞాన మార్గము ద్వారా (మృత్యువంటే తెలుసుకొని ) మృత్యువుకు అతీతమయిన స్థితిని అందుకుంటారు.
అంటే కర్మ మార్గములో చావును దాటుతారు కానీ చావుకు అతీతులు కాలేరు. చావు మరో జన్మకు వారధి అని తెలుసుకున్న జ్ఞానులు మృత్యు రహిత స్థితిని అంగీకరించ గలుగుతారు.

పన్నెండవ మంత్రము:

అంధం తమః ప్రవిశంతి
యే s సంభూతి ముపాసతే |
తతో భూయ ఇవ తే తమో
య ఉ సంభూత్యాః రతాః ||

ఒక వ్యాఖ్యానమును అనుసరించి సంభూతి అంటే ఆవిష్కరించ బడినది.. ఆంగ్లములో దీనికి manifested అనే పదమును వాడినారు. అదే విధముగా అసంభూతి అంటే ఆవిష్కరణ కానిది.( unmanifested )యే అసంభూతిముపాసతే అంధం తమః ప్రవేశంతి. అంటే యే ఎవరయితే అసభూతిముపాసతే అంటే ఆవిష్కృతము కాని దానిని అంటే ప్రకృతి శక్తులను ఉపాసిస్తారో వారు అంధం తమః ప్రవిశంతి అంటే కటిక చీకటిలో ప్రవేశిస్తారు. య సంభూత్యాః రతాః య ఎవరయితే సంభూత్యాః రతాః


                    ఆవిష్కృతమయిన ప్రపంచముతో అనుబంధము పెంచుకుంటారో తే వారు ఉ కూడా భూయ బహుళమైన లేదా ఎక్కువయినా ఇవ తమః అటువంటి చీకటిని (ప్రవేశిస్తారు ).
ఇక్కడ మొదట ఉపాసతే అను పదమును వాడినారు. రెండవ చోట రతాః అనే పదమును వాడినారు. మొదటిది ఆరాధన, రెండవది అనురక్తి అంటే బంధము. బంధము ఎప్పుడూ చీకటి లోనికి దారి తీస్తుందనే విషయము జగద్విదితమే. ఉపాసనతో ఆనందము కలుగ వచ్చును. అంతే గాక శక్తులను ఇస్తుంది. అనురక్తి బంధాన్ని పెంచుతుంది. కాని ప్రకృతి ఉపాసన వలన భగవంతుడి వైపు చేరే లక్ష్యము ఉండదు. అందు వలన రెండింటి లోనూ చీకటిలో ప్రవేశిస్తారు. తరువాత చెప్ప బడిన ప్రకారము ఎక్కడయితే బంధము ఏర్పడదో అది భగవంతుడి దగ్గిరకు చేర్చుతుంది.
తాత్పర్యము: ప్రకృతి ఆరాధన వలన :చీకటి లోకాలలో కి వెళ్ళతాము. అదే ఆవిష్కృత ప్రపంచముతో అనుబంధము వలన మరింత చీకటి లోకాల లోకి ప్రవేశిస్తాము.


పదమూడవ మంత్రము:
అన్య దేవాహహుః సంభవా
దన్య దాహురసంభవాత్ |
ఇతి శుశ్రుమ ధీరాణాం
యేనస్తద్ విచచక్షిరే ||

అన్యత్ ఏవ ఆహుః సంభవాత్ ఆన్యత్ ఏవ మరో రకముగా సంభవాత్ ఆవిష్కృతమయిన వాటి గురించి ఆహుః చెప్పా బడినది. అసంభవాత్ ఆవిష్కృతము కాని వాటిని గురించి అన్యత్ మరో రకముగా ఆహుః చెప్పబడినది. ధీరాణాం విజ్ఞుల నుండి ఇతి శుశ్రుమ ఈ విధముగా వింటున్నాము. ఏనః తత్ విచ చక్షిరే అది ఆ విధముగా వివరించ బడినది.
తాత్పర్యము:ఆవిష్కృత మయిన వాటి పై సాధన గురించి ఒక విధముగా ఆవిష్కృతము కాని వాటి గురించి మరో విధముగా చెప్ప బడినది. ఈ విధముగా విజ్ఞులు చెప్పగా విన బడినది.


పదునాల్గవ మంత్రము:

సంభూతిం చ వినాశం చ
యస్తద్వేదోs భయః సహ |
వినాశేన మృత్యుంతీర్త్వా
సంభూత్యామృత మశ్నుతే ||

సంభూతిం ఆవిష్కృత ప్రపంచమును చ మరియు వినాశం అంటే లయము లేదా ప్రళయమును ఉభయః సహ రెండింటిని గురించి తత్ దానిని వేదః తెలుసుకున్న వాడు భయాపహ భయమును వదలి వినాశేన నాశనము వలన మృత్యుమ్ మృత్యువును తీర్త్వా దాటి సంభూత్యా ఆవిష్కృతము అయిన ప్రపంచము ద్వారా అమృతత్వమును అశ్నుత పొందును.
తాత్పర్యము: ఎవరయితే ఆవిష్కృతము మరియు వినాశము గురించి తెలుసుకుంటారో వారు వినాశము ద్వారా మృత్యువును దాటి ఆవిష్కృత ప్రపంచము ద్వారా అమృతత్వమును పొందెదరు.
ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. వినాశము ద్వారా మృత్యువును ఎలా దాటుతారు?
కాస్త వివరణ: ఇక్కడ ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఒక వ్యాఖ్యానములో మొదటి పాదములో సంభూతి కి బదులు అసంభూతి ఉంటే కాస్త అర్థ వంతముగా ఉంటుందని సూచన ఈయ బడినది. కాని ఇది వేద పాఠములో భాగముగా ఋషుల ద్వారా దర్శించ బడి ఛందస్సులో బంధించ బడిన శ్లోకము లేదా మంత్రము. అందులో సవరణ చేయాలంటే చాలా ధైర్యము కావలసి యుంటుంది. అయితే సహజముగా భారతీయ ఋషి సంస్కారానికి సంబంధించిన వారికి పునర్జన్మ మీద నమ్మకము ఉంటుంది. వినాశనము ద్వారా మృత్యువును దాటుట ద్వారా తిరిగి జన్మ ఎత్తుతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తీ తనకు మృత్యువు అనేది లేదన్న విషయాన్ని గుర్తిస్తాడు. అమృతత్వమ్మును పొందటము అంటే ఇదే. ఇది పరోక్షముగా పునర్జన్మను సూచిస్తుంది.

పదిహేనవ మంత్రము:

హిరణ్మయేన పాత్రే ణ
సత్యస్యాపి హితం ముఖం |
తత్త్వం పూషన్నపావృణు
సత్య ధర్మాయ దృష్టయే ||

హిరణ్మయేన బంగారుతో నిండిన లేదా బంగారు రంగుతో కూడిన పాత్రేణ పాత్ర వలన సత్యస్య ముఖం సత్యము యొక్క ముఖము అపిహితం అంటే మూయ బడినది. సత్య ధర్మాయ ధృష్టయే సత్యము మరియు ధర్మములను సరిగా చూచి ఖచ్చితముగా ఉండుటకు లేదా సరిగా చూచి నిర్ణయించుట కొరకు పూషన్ పోషణ భాద్యతను స్వీకరించిన దేవా! తత్ దానిని త్వం మీరు అపావృణు తొలగించుము.
తాత్పర్యము: ఓ పరమేశ్వరా! నీ యొక్క సత్య రూపమయిన ముఖము బంగారు పాత్ర చేత మూయ బడినది. సత్య ధర్మములను నిర్ధారించు కొనుటకు ఆ (తేజస్సును) తొలగించుము.(అప్పుడు మీ ముఖమును మేము చూడ గలము. )
ఇక్కడ భగవంతుడి రూపము బంగారు కాంతితో ఉన్నట్లు చూపించ బడినది. ఇది సాధకుడికి నిరంతరమయిన కోరికగా ఉండ వలయును.


పదునారవ మంత్రము:

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య
వ్యూహ రశ్మీన్ సమూహ |
తేజో యత్తే రూపం కళ్యాణ తమం పశ్యామి
యో సావసౌ పురుషః సోహమస్మి ||

పూషన్ పోషించు వాడా! ఏకర్షే ఏకైక జ్ఞాన స్వరూపా! యమ సూర్య ప్రాజాపత్య రశ్మిన్ యముడు, సూర్యుడు, ప్రజాపతి మున్నగు వారి కిరణములను సమూహ ఏకత్వమును పొందించునది వ్యూహ విశేష మయిన పధ్ధతి కలది. యత్ ఏదయితే తే నీ యొక్క తేజో రూపం తేజస్సుతో కూడిన రూపము కళ్యాణ తమం మంగళాన్ని కలిగించునది పశ్యామి చూచుచున్నాను. అసౌ పురుషః ఆ పురుషుడిని పశ్యామి చూచుచున్నాను. సః అతడే అహం నేను అస్మి అయి ఉన్నాను.
తాత్పర్యము: ఓ సర్వ పోషకుడా! ఏకైక జ్ఞాన స్వరూపా! సర్వ నియంతా!(యమ) లక్ష్య ప్రదాతా! (సూర్య) సృష్టి ప్రదాతా!(ప్రజాపతి) కళ్యాణ తమ మయిన నీ యొక్క తేజో రూపాన్ని చూచుచున్నాను. అదే పురుష రూపము. నేను కూడా ఆ రూపాన్నే.
ఇది అద్వైత సిద్ధాంతానికి పూర్ణ రూపము.

పదిహేడవ మంత్రము:

వాయురనిల మమృతమమథేదం
భస్మాంతః శరీరమ్ |
ఓం క్రతో స్మర కృతః స్మర
క్రతో స్మర కృతః స్మర ||

అథ ఇప్పుడు వాయురనిల పంచ ప్రాణముల తో కూడిన వాయువు ౪౯ విభాగాలుగా ఉన్న సమిష్టి వాయు తత్త్వము అయిన అనిలము తో కలిసి పోవు గాక. ఈ శరీరము భస్మమగు గాక. ఓం క్రతోః యజ్ఞ స్వరూపా! స్మర నన్ను గుర్తుంచు కొనుము. కృతః స్మర చేసిన వాటిని గుర్తుంచు కొనుము.
తాత్పర్యము: ఓం పరమేశా! ఇప్పుడు (నా మరణము తరువాత ) నా పంచ ప్రాణాలు సమిష్టి వాయు తత్వములో కలిసి పోనీ. నా భౌతిక శరీరము భస్మ కృతము అగు గాక. యజ్ఞ స్వరూపా! నన్ను గుర్తుంచుకొనుము. నేను చేసిన పనులను గుర్తుంచుకొనుము.

పదుఎనిమిదవ మంత్రము:

అగ్నే వయ సుపథా రా యే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్ |
యుయోధ్య స్మజ్జు హురాణమేనో
భూయిష్థాం తే నమ ఉక్తిం విధేమ ||

అగ్నే! అగ్ని దేవతా! అస్మాన్ మమ్ములను సుపదా మంచి మార్గములో రాయే కర్మ ఫలితములనండుకోనుతకు నయ నడిపించుము. దేవ పరమేశ్వరా! విశ్వాని వయునాని ప్రపంచములో అన్ని కర్మలను ధ్యానములను విద్వాన్ తెలిసిన వాడవు. అస్మత్ మా యొక్క జుహురాణం ప్రతిబంధకాలను ఏనః సంబంధించిన ( పాపాలను) యుయోధి తొలగించుము. తే నీకు భూయిష్థామ్ పదే పదే లేదా మరల మరల నమ ఉక్తిం నమస్కార వాక్యములను విధేమ పలుకుచున్నాము.
తాత్పర్యము: అగ్ని దేవా! మమ్ములను మంచి మార్గములో కర్మ ఫలములను అందుకొను నట్లుగా నడిపించుము. నా కర్మలను నీవు ఎరుగుదువు. నా మార్గములో అడ్డంకులను తొలగించుము. మీకు పదే పదే నమస్కారములు చెబుతాము.