నీలకంథ మహాదేవుడి గుడిలోవినాయక చవితి నాడు ఆర్భాటముగా
గణేశుడికి పూజకు ఏర్పాట్లు మొదలయినాయి.
శివాలయము ప్రక్కన మంటపములో పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసినారు.
ఆర్భాటముగా గణేశ ఉత్సవాలు చేయటము మొదట మహారాష్ట్ర లో
మొదలయినది. బాల గంగాధర తిలక్ గారు “స్వారాజ్యము నా జన్మ హక్కు “ నినాదముతో బాటు ఊళ్ళ
మధ్యలో సామూహికముగా గణేశ ఉత్సవాలను చేయడము అలవాటు చేసినాడు. అక్కడ నుండి హైదరాబాద్
ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా గణేశ ఉత్సవాలను వైభవముగా సామూహికముగా చేయడము అలవాటు
అయింది. ఒకే ఊళ్లో వేర్వేరు మంటపాల్లో
చేయడము కూడా అలవాటు అయింది. ఈ విధముగా వివిధ మంటపాల నిర్వాహకుల మధ్య పోటీ కూడా
ఏర్పడింది. ఈ పోటీ పెరిగే కొద్దీ విగ్రహాలు పెద్దవైనాయి. అవి బలముగా నిల బడుటకు
మట్టికి బదులుగా జిప్సం లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మరి కాస్త బల పరచడానికి మధ్యలో
ఇనుప కడ్డీలు , ఇంక వాటికి రంగులు బాగా అందముగా వేయటము అలవాటు చేసుకున్నారు.
సమస్యలు ఇక్కడే మొదలయినాయి.జిప్సం తో చేసిన విగ్రహాలు
నీటిలో వేసిన తరువాత తొందరగా మట్టిలో
కలిసి పోవు. అంతే గాక ఆ రసాయనాలు ఆరోగ్యానికి మంచివి కావు. మట్టి విగ్రహము అయితే
ఎటువంటి సమస్య ఉండదు. ఇంక ఈ భారీ ప్రమాణపు విగ్రహాలకు వేసే రంగులు ఆరోగ్యానికి
మంచివేనా అని చెప్పే వారు ఎవరూ లేరు. పూజకు వాడే పత్రి నీటిలో కలిపినందు వలన నీరు
పాడవుతున్నాదని కొందరి వాదన. ఎవరి భయాలు వాళ్ళవి.
ఇదే సమయములో శేఖర్ తన మిత్ర బృందముతో స్వామీజీ దగ్గిరకు
వచ్చినాడు. “మా అనుమానాలను తీర్చటము ఇప్పుడు వీలవుతుందా స్వామీజీ!” అని అడిగినాడు.
ఆయన అనుమతితో లోపలికి ప్రవేశించినాడు.
“స్వామీజీ! అప్పుడు మీరు చెప్పినట్లు రాత్రి
పండుకొనేటప్పుడు ఆ రోజు సంఘటనలను వ్యతిరేక దిశలో గుర్తు చేసుకుంటుంటే చాలా
బాగుందండీ.”
“బాగుండటమే కాదు. కొన్ని నెలలు క్రమము తప్పకుండా
చేస్తే గత జన్మ విషయాలు కూడా గుర్తు
వస్తాయి.”
“నిజముగా మరో జన్మ ఉన్నదంటారా?”
“నీకు కలల్లో నీకు సంబంధము లేని విషయాలేవీ కనిపించవు. అక్కడ
నీవు ఎన్నడూ చూడని వి ఎన్నో కనిపిస్తాయి. వాటిని ఒక క్రమ పద్ధతిలో కొన్ని నాళ్ళు
గమనిస్తే వాటికి మీకు ఉన్న సంబంధము తెలుస్తుంది. ఆ అవగాహన ఏర్పడిన తరువాత నీకు ఈ
ప్రశ్న రాదు. అయినా ఈ నాడు పునర్జన్మల అనుభవాలతో కూడిన పరిశోధనలు ఎన్నో
జరుగుతున్నాయి. వీటిని గురించి మరొక సారి వివరముగా మాట్లాడు కుందాము. వినాయక చవితి
ఉత్సవాల మీద గొడవ ఏమయినా ఉందా?”
“ప్రత్యేకముగా గొడవ ఏమీ లేదు. కానీ కొంత మంది కొన్ని
ప్రశ్నలు వేస్తునారు. వాటికి మాకు ఏమి సమాధానము చెప్పాలో తెలియదు. ఇంక మాకు కూడా
కొన్ని అనుమానాలు ఉన్నాయి.”
“ఏమిటో చెప్పవయ్యా.”
“ఈ విగ్రహాలను పత్రిని నీటిలో కలపడము వలన నీరు కళంకితమవుతుందని
అందరూఅంటున్నారు. అసలు విషయము ఏమిటంటారు.”
“సామాజిక స్పృహ అనేది చాలా మంచిది. కానీ అన్నీ ఒక పక్షముగా
ఉండ కూడదు. కాలువల్లో ఎన్ని రకాలుగా మురికి నీరు కలిపి వాటిని పాడు చేస్తున్నారో
తెలియని విషయము కాదు.ప్రతి ఇంటిలో మురికి నీరు మాత్రమే కాక పరిశ్రమల్లో ఏర్పడిన
చెత్త అంటా వాటిలోనే కలుస్తున్నది. అక్కడ ఎవరూ మాట్లాడుట లేదు. శుభ్రముగా ఉన్న
పరిసరాల్లో దేవతలు నివశిస్తారని పవిత్ర గ్రంథాలు అన్నీ చెబుతాయి, ఏ మతములో అయినా.అది
మనము పూర్తిగా వదిలి వేసినాము. ఇంక వినాయక చవితి విషయానికి వస్తాము. విగ్రహాన్ని
బంగారుతో కానీ, వెండి తో కానీ , రాగి తో కానీ లేదా మట్టి తో గానీ శక్తికి లోపము
లేకుండా చేయమన్నారు. ఒక సామూహిక ఉత్సవములో మట్టితో అయినా పెద్ద విగ్రహాన్ని చేయ
వచ్చును. మట్టి విగ్రహాలను నిమజ్జనానికి వాడితే నీరు ఏ విధముగా పాడు కాదు.
నిజానికి ప్రకృతి వైద్యములో వాళ్ళంతా మట్టిని పట్టించుకోని ఆరనిచ్చి తరువాత
స్నానము చేస్తారు. మధ్యలో ఇనుప కడ్డీలను వాడినా ఎటువంటి సమస్య యుండదు. ఎందుకంటే మన
రక్తములో ప్రధాన రసాయనము ఇనుమే. ఏ ఇతర రసాయనాలు వాడినా ప్రకృతికి ద్రోహము
చేస్తున్న వాళ్ళమే అవుతాము.” (నిజానికి జిప్సం/కాల్షియం సల్ఫేట్ ఎక్కువగా ఉంటె
కాన్సర్ రావచ్చు అన్న అభిప్రాయము కూడా యున్నది.)
“స్వామీజీ! ఇప్పుడు నా ప్రశ్న మీకు ఇబ్బంది కలిగిస్తుందేమో?
గణేశుడికి ఏనుగు తల ఏమిటి? ఇది విచిత్రముగా అసహజముగా అనిపించదా? ఇంతకూ ముందు
రోజులలో అయితే ఇది మూద విశ్వాసమని
వాదించే వాడిని.కానీ ఇప్పుడు జిజ్ఞాసతో తెలుసు కోవాలని అడుగుతున్నాను. చెబుతారా?”
“నీవు అడిగిన పధ్ధతి చాలా ముచ్చట వేస్తున్నాదయ్యా. ఈ
విషయములో నాకు పరి పూర్ణత లేక పోయినా , తెలిసినంత వరకు చెబుతాను. ఇందులో కొన్ని
విషయాలు తంత్రములో ప్రవేశము లేని వారికి అర్థము కాదు. అయినా నా ప్రయత్నము నేను
చేస్తాను.” ఒక నిముషము ఆగినాడు.
“మనకున్న పండుగలలో ఎక్కువ భాగము ఆకాశములోగ్రహ, నక్షత్ర తారకల అమరిక మీద ఆధార పడి యున్నాయి. ఉదాహరణకు
శ్రవణ నక్షత్రమును తీసుకుందాము. ఆకాశములో ఒక తారల అమరిక విష్ణు మండల ఆకారములో యుంటుంది. నిజానికి మన
శాస్త్రాల ప్రకారము తారలు వేరు, నక్షత్రములు వేరు. ఆకాసమును ఇరువది ఏడు విభాగాలు
చేసినపుడు ఒక్కొక్క విభాగాన్ని అశ్వని, భరణి పేర్లతో యున్న నక్షత్రములని అన్నాము.
అందులో మిణుకు మంటూ మెరిసే ముద్దను తార అని అన్నాము. అంటే ఒక నక్షత్రములో ఎన్నో
తారలు ఉంటాయి. అందుకనే ప్రతి చోట గ్రహ నక్షత్ర తారకలు అని నక్షత్రాలకు తారలకు
తేడాను చూపిస్తాము. ఆ విష్ణు మండల రూపాన్నే మన వారు ఆది శేషుడు పైన పవళించిన శ్రీ
రంగ నాథుడిగా దర్శించినాము. పాశ్చాత్యులు ఈ మండలాన్నే హీర్కులేస్ అని అన్నారు.. ఆకాశములో మిధునము
నుండి ధనుస్సు వరకు ఆకాశములో ఒక మహా
సాగరాన్ని సూచించే విధముగా ఒక తారల గుంపు ఉన్నది. దీనినే పాల సముద్రము, పాల పుంత
లేదా మిల్కీ వే అని అన్నారు. అంటే పాల సముద్రములో శ్రీ మహా విష్ణువు ఆది
శేషుడిపై పండుకొని యున్నారు. ఆయనకు ఒక
ప్రక్కగా ఒదిగి శ్రవణ నక్షత్రము యున్నది.
దీనిని గరుత్మంతుడి గా భావించినారు. అందుకే వైష్ణవ దేవాలయములలో మూల విగ్రహానికి
ఎదురుగా గరుత్మంతుడు ఉంటాడు.” రెండు నిముషాలు ఆగినాడు.
“పురాణాలలో గరుత్మంతుడు అమృతాన్ని భూమికి తీసుకొని
వచ్చినాడు. అందుకనే ఆయనను ప్రాణ శక్తికి సంకేతముగా భావించినారు. శ్రవణము నాడు
షష్టి వస్తే అది సుబ్రహ్మణ్య షష్టి అవుతుంది. శ్రవణము నాడు దశమి వస్తే అది విజయ
దశమి అవుతుంది. శ్రవణము నాడు పూర్ణిమ వస్తే అది వేదం ధర్మానికి పునరంకితము
చేసుకొనే శ్రావణ పూర్ణిమ అవుతుంది. అంతే కాదు.ఆ నాడు వచ్చిన బహుళ చతుర్దశి మహా శివ
రాత్రి అవుతుంది. ఆ విధముగా ఈ నక్షత్రము నుండి ఒక్కొక్క నక్షత్రములో ఒక్కొక్క రక
మైన ప్రాణ శక్తి క్రిందికి దిగుతుంది. నీకు అర్థము చేసుకొనే వ్యవధి కొరకే మధ్యలో
ఆగుతున్నాను.”
“హస్త నక్షత్రము గణపతికి సంకేతము. అక్కడ తారల గుంపు ఏనుగు
తొండము వలె కనిపిస్తుంది. చవితి నాడు ఈ నక్షత్రము సూర్యోదయము తో కలిసి ఉదయిస్తుంది
. అందుకే ఆరోజు వినాయక చవితిని జరుపుకుంటారు.”
“మరి ఆ రోజు ఆకులతో ఎందుకు పూజిస్తారు?”
“అదే ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ నాడు పూజకు వాడే
ఇరువది యొక్క పత్రులు ప్రత్యెకమయిన ఔషధీ గుణాలను కలిగి యున్నాయి. ఆయుర్వేద
పుస్తకాల్లో వాటి ప్రయోజనాలు దొరుకుతాయి. కావేరీ జలాల్లో ఔషధీ లక్షణాలు చాలా
ఉన్నాయని చెబుతారు. కారణము తెలుసా? ఆ నది మనుషులు దూరని కారడవుల్లో ఎన్నో మూలికల
ప్రభావాన్ని తనతో తీసుకొని వస్తుంది. అదే విధముగా ఈ మూలికలు నిమజ్జనము చేస్తే ఆ
నీళ్ళకు వాటి ప్రభావము వస్తుంది. అంతకంటే ఏమీ కాదు. ఆకులు కలిసిన నీళ్ళు
పాడవుతున్నాయి అని అంటే ఎక్కడయినా పరీక్ష చేసారా అని అడగాలి. పాత కాలములో ఎవరూ
శుద్ధి చేసిన నీరు వాడే వారు కాదు. నూతి నీళ్ళు లేదా చెరువు నీళ్ళు నేరుగా తాగే
వారు. ఆరోజుల్లో వాళ్లకు ఎపుడూ ఏ జబ్బు రాలేదు. ఆ చెరువుల ప్రక్కన చెట్ల ఆకులన్నీ
ఆచేరువులో పడుతూనే ఉండేవి.”
“వినాయకుడికి ప్రత్యేకముగా ఉండ్రాళ్ళు ఎందుకు?”
“వినాయక చవితి నాటికి బాగా వర్షాలు పడి భూమి కొత్త జవ
సత్వాలను పుంజుకుంటుంది. నేలంతా చిత్తడిగా ఉంటుంది. వాతావరణములో మార్పుల వలన జల
తత్వపు వ్యాధులు అంటే రొంప, కలరా లాంటివి బలాన్ని పుంజుకుంటాయి. ఆ సమయములో నూనె తో
చేసిన వంటకాలు ఈ వ్యాధులకు మరింత బలాన్ని చేకూర్చుతాయి. అందుకే నూనె పదార్థాలు
కాకుండా ఉండ్రాళ్ళు లాటివి వంటికి చాలా మంచిది. అంతే కాని పండుగ కదా అని పులి హోరా
చేసుకొని తినడము వినాయకుడికి నచ్చదు. ఎందు కంటే అది ఆ సమయములో ఆరోగ్యానికి మంచిది
కాదు కదా.”
“మరి కొన్ని విషయాలు చెప్పాలి. గణపతి మూలాధారానికి అధిపతి.
తంత్ర శాస్త్ర రీత్యా మూలాధారము బలము గా ఉంటె భౌతిక జీవితములో విజయము లభిస్తుంది.
పొడవుగా యున్న తొండము లేదా ముక్కు వలన శ్వాస నెమ్మదిగా జరుగుతుంది. శ్వాస
నీమ్మడిగా యుంటే ఆయుర్దాయము పెరగడమే కాక మనస్సు ప్రశాంత స్థితి కి వస్తుంది.
అందుకే ఈ రోజుల్లో ఆల్ఫా లేదా తీటా
ధ్యానములను చాలా మంది బాగా ఎక్కువ రుసుము చెల్లించి నేర్చుకుంటున్నారు. నోరు అసలు
కనిపించదు. అంటే చాలా తక్కువ మాట్లాడమని అర్థము. పెద్ద చెవులు చెబుతాయి, చెప్పడము
కంటే వినడానికి ప్రాధాన్యత ఇవ్వమని.ఇలా ఒక్కొక్క అంగము ఒక్కొక్క లక్షణాన్ని సూచిస్తుంది.
మన ప్రతి దేవీ దేవతల విగ్రహాలలో కూడా ఇటువంటి రహస్యాలు ఎన్నో యున్నాయి.”
“చాలా విషయాలు చెప్పారు స్వామీజీ! మళ్ళీ కలుస్తాము.”
“శుభం భూయాత్”
***************************************
No comments:
Post a Comment